వీ6 వివేక్‌పై వేటు త‌ప్ప‌దా…?

అసెంబ్లీ ఎన్నిక‌ల సమ‌యంలో పార్టీలో కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రించి సొంత అభ్య‌ర్థుల ఓటమికి కృషి చేసిన నేత‌ల‌పై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. అలాంటి అభ్య‌ర్థుల‌ను ఏదో విధంగా పార్టీలో కొన‌సాగించ‌డం కంటే వ‌దిలించుకోవ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయంలో తెరాస అధినేత కేసీఆర్ ఉన్నారు. ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఓట‌మికి అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే కార‌ణ‌మ‌ని ఏకంగా ముఖ్య‌మంత్రే బ‌హిరంగంగా ఒప్పుకున్నారు. దీంతో కోవ‌ర్టుల్లో అల‌జ‌డి మొద‌లైంది.

అయితే పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్ / వివేకానంద ఈ గొడ‌వ‌ల్లో చిక్కుకున్నారు. విశాఖ ఇండ‌స్ట్రీస్‌, వీ6 న్యూస్ చాన‌ల్‌, వెలుగు దిన‌ప‌త్రిక‌ల అధినేత అయిన వివేక్ టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వ‌ర్ ఓట‌మికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించార‌ని సొంత పార్టీ నేత‌లో ఆరోప‌ణ‌లు చేశారు. ఈశ్వ‌ర్ ఓటమి కోసం వివేక్ భారీగా ఖ‌ర్చుపెట్టార‌ని కూడా ఆరోపించారు. దీంతో వివేక్ డిఫెన్స్‌లో ప‌డ్డారు.

KCR and Vivek

కోవ‌ర్టు ఆరోప‌ణ‌ల‌పై టీఆర్ఎస్ నాయ‌క‌త్వానికి వివేక్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. వ్యాపారం న‌ష్టాల్లో ఉంద‌నీ, ఖ‌ర్చు పెట్టి అభ్య‌ర్థుల‌ను ఓడించే స్థోమ‌త త‌న‌కు లేదనీ, సొంత అన్న వినోద్‌దే ఆర్థిక స‌హాయం చేయ‌లేక‌పోయాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. కానీ టీఆర్ఎస్ నాయ‌క‌త్వం వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాలని వివేక్ భావిస్తున్నారు. బాల్క సుమ‌న్ చెన్పూరు నుంచి ఎంఎల్ఏగా ఎన్నిక కావ‌డంతో ఇక పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ సీటు ఇక వివేక్‌కే అని అంద‌రూ భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నాయ‌క‌త్వం దీనికి సానుకూలంగా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఆరోప‌ణ‌ల‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీ నుంచి పంపించాలా లేక వివేకే స్వయంగా బ‌య‌ట‌కు వెళ్లేలా చేసి, పెద్ద‌ప‌ల్లి సీటు వేరేవారికి ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. తాజా వివాదంతో వివేక్ రాజ‌కీయ భ‌వితవ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.