ఎవ‌రి వార్త‌లు వాళ్లకే అయితే.. విజ‌య‌వాడ‌లో ఈ యాడ్స్ ఎందుకు?

వైజాగ్‌, బెంగాల్, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల తర్వాత హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోపాటు మీడియాపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొద్దుగాల లేవ‌గానే ఈ ఆంధ్రా వార్త‌లు మాకెందుకు అంటూ మీడియాకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న మీడియా సంస్థ‌ల‌ను ప‌రిశీలించి, తెలంగాణ వార్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌వాటికే మేం కూడా ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు.

ఇది జ‌రిగి వారం గ‌డ‌వ‌క‌ముందే జ‌న‌వ‌రి 1 న కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలంగాణ‌, ఏపీల్లోని అన్ని ప‌త్రిక‌ల్లో తెలంగాణ ప్ర‌భుత్వం ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. విద్యుత్తు రంగంలో తెలంగాణ సాధించిన విజ‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ అన్ని పేప‌ర్ల‌కు మొద‌టి పేజీ యాడ్ ఇచ్చారు. అంటే ఆంధ్ర‌లో కూడా పేప‌ర్లు కొన్న‌వాళ్లు మొద‌ట తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్ చూడాల్సిందే.

Telangana Govt ad in AP Papers

మ‌రి తెలంగాణ‌లో ఆంధ్ర‌వార్త‌లు అవ‌స‌రం లేద‌న్న కేసీఆర్‌, ఆంధ్ర ఎడిష‌న్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వ విజ‌యాల గురించి ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డంలో ఆంత‌ర్యం ఏమిటి? తెలంగాణ‌లో ఆంధ్ర ప్ర‌జానీకం కూడా ల‌క్ష‌ల్లో ఉన్నారు కాబ‌ట్టి ఆంధ్ర వార్త‌లు కొన్ని ఇక్క‌డ ఇస్తున్నామ‌ని మీడియా స‌మ‌ర్థించుకోవ‌చ్చు. కానీ ఆంధ్ర‌లో తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు నామ‌మాత్రం. మ‌రి అక్క‌డ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ విజ‌యాల గురించి ఎందుకు? కేసీఆర్ అభిప్రాయం మార్చుకున్నారా?

వాస్త‌వానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో కూడా ఆంధ్ర వార్త‌లు ప్ర‌చురిస్తున్నారు. అయితే అందులో జాగ్ర‌త్తగా చంద్ర‌బాబు వ్య‌తిరేక వార్త‌లే వేస్తున్నారు. అది వ్య‌తిరేక‌మైనా, అనుకూల‌మైనా ఆంధ్ర రాజ‌కీయాల‌కు సంబంధించిందే క‌దా. మ‌రి మీ సొంత ప‌త్రిక చేస్తున్న ప‌ని, మిగ‌తా ప‌త్రిక‌లు, టీవీలు చేస్తే త‌ప్పేంటి సార్‌?