ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో పాసయింది. ఈ బిల్లు వల్ల మజ్లిస్, టీఆర్ఎస్ బంధం మరింత గట్టి పడింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో లోక్‌సభలో అన్ని సందర్భాల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో మాత్రం వ్యతిరేకించింది. తమ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్ రెడ్డి చెప్పారు. అయితే దీని వెనుక టీఆర్ఎస్ రాజకీయ ప్రాథమ్యాలు చాలా ఉన్నాయి.
కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ స్థానంలో పూర్తి స్థాయి బిల్లును తీసుకొచ్చింది. దీనికి లోక్‌సభలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ అనేక సవరణలు ప్రతిపాదించారు. సహజంగానే ఇవేవీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే బిల్లు సందర్భంగా మజ్లిస్‌తో టీఆర్ఎస్‌కు ఉన్న దోస్తీ మరోసారి ముందుకొచ్చింది. తెలంగాణలో బీజేపీ గురించి టీఆర్ఎస్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే బీజేపీ, మజ్లిస్‌లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు టీఆర్ఎస్ మజ్లిస్‌నే ఎంచుకుంది.
టీఆర్ఎస్ ఈ బిల్లును వ్యతిరేకించినందువల్ల బిల్లు ఓడిపోయే పరిస్థితి కూడా ఏమీలేదు కాబట్టి అటు బీజేపీకి కూడా ఇబ్బంది లేకుండా గులాబీ పార్టీ వ్యవహరించింది. తన నిర్ణయానికి మద్దతుగా సహజంగానే మతం, వర్ణం, లింగభేదం, మహిళల హక్కుల పరిరక్షణ పేరిట మైనారిటీల విశ్వాసం దెబ్బతీయడం… ఇలా అనేక విలువలను ప్రస్తావించింది.