సంక్రాంతి తర్వాత తెలంగాణ మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు అవుతుందని సమాచారం అందడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు కావడంతో తెరాస ఎమ్మెల్యేలు తమ తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. 7-8 మందికి అవకాశం లభించవచ్చు. తర్వాత మరో విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఈనెల 18న విస్తరణ చేపట్టవచ్చు.
ఈసారి మంత్రివర్గంలో కొన్ని సంచలనాలు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్‌లకు మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని సమాచారం. హరీష్ రావును పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయించే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లే తప్పనిసరిగా గెలిచే వారినే నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
అలాగే కేటీఆర్ పార్టీ బాధ్యతల్లో ఉన్నందున మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవచ్చు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంపై కేటీఆర్ దృష్టిపెడుతున్నారు. అదీగాక ఈసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం, కాంగ్రెస్ అగ్రనేతలను ఓడించి సత్తా నిరూపించుకున్నవారు చాలామంది ఉండటంతో మంత్రిపదవుల ఆశావహుల సంఖ్య పెరిగింది. వీరందరినీ కేసీఆర్ ఎలా సంతృఫ్తి పరుస్తారనేది సవాలే.
మంత్రివర్గంలో ఉండొచ్చని వినిపిస్తున్న ఆశావహుల పేర్లు: జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఆరూరి రమేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రెడ్యానాయక్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జోగు రామన్న, గుత్తా సుఖేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రేఖానాయక్, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్ భాస్కర్, నరేందర్‌రెడ్డి.