తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖంగుతిన్న కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ సీనియర్ నాయకులను పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దించాలని యోచిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల నాడి వేరే విధంగా ఉంటుందని, జాతీయ స్థాయిలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. రేవంత్ రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
టీడీపీతో పొత్తు ఉంటుందా?
పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకత్వం పొత్తుకు కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకులు మాత్రం టీడీపీతో పొత్తుపై విముఖతతో ఉన్నారు. ఈ పొత్తువల్లే తాము ఓడిపోయినట్లు భావిస్తున్న నాయకులు కూడా ఉన్నారు.
అయితే ఏఐసీసీ అధినాయకత్వం తెలుగుదేశంతో పొత్తుపై ఎలా స్పందిస్తుందనేది చూడాలి. జాతీయ స్థాయిలో చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నందువల్ల తెలంగాణలో విడిగా పోటీ చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయనేది కాంగ్రెస్ పరిశీలించాల్సి ఉంటుంది.