మహమూద్ అలీ… కేసీఆర్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి లాంటి కీలక పదవుల్లో ఉండి కూడా పెద్దగా జనానికి తెలియని పేరు. ఈసారి మాత్రం ఆయన పేరు బయటికొచ్చింది. కేసీఆర్ తనతోపాటు ప్రమాణం చేయడానికి తీసుకొచ్చి ఏకంగా హోంశాఖ ఇవ్వడంతో మహమూద్ అలీ గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. 2001లో కేసీఆర్‌తోపాటే టీఆర్ ఎస్‌లో ప్రయాణం ప్రారంభించి అడుగడుగునా కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా మహమూద్ అలీ మెలిగారు. ఎలాంటి పదవులు లేకపోయినా కేసీఆర్ పార్టీ వెన్నంటే ఉన్నారు. 2014లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి అలీ ఓడిపోయారు. అయితే కేసీఆర్ ఆయన్ను ఎంఎల్సీగా ఎంపిక చేసి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎలాంటి పండగైనా, పార్టీ అయినా కేసీఆర్ మహమూద్ అలీ ఇంటికి వెళ్లాల్సిందే. మహమూద్ అలీ ఇంట్లో కేసీ ఆర్ కు ప్రత్యేకంగా ఒక గది కూడా ఉందంటే వారిద్దరి అనుబంధం అర్థం చేసుకోవచ్చు.
మంత్రి మహమూద్ అలీ ప్రొఫైల్
పేరు : మహమ్మద్ మహమూద్ అలీ
తండ్రి : పీర్ మహమ్మద్
పుట్టిన తేదీ : 1953 మార్చి 2
పుట్టిన స్థలం : ఉస్మాన్పుర, హైదరాబాద్
నివాసం : ఆజంపుర, హైదరాబాద్
కుటుంబం : భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
విద్యార్హత : బీకాం, ఉస్మానియా యూనివర్సిటీ
రాజకీయ ప్రవేశం : 2001లో టీఆర్ఎస్లో వ్యవస్థాపక సభ్యుడిగా చేరిక.
రాజకీయ పదవులు : 2013లో ఎమ్మెల్సీ, 2014లో ఉప ముఖ్యమంత్రి (రెవిన్యూ, మైనారిటీ సంక్షేమం కూడా)
2018లో హోంమంత్రిగా మరోసారి మంత్రివర్గంలోకి వచ్చారు.
మైనారిటీ సామాజిక వర్గం నుంచి హోం మంత్రి పదవి చేపట్టిన రెండో వ్యక్తి మహమూద్ అలీ. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఎం.ఎం. హస్మీ హోం మంత్రిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత మళ్లీ అదే సామాజిక వర్గం నుంచి అలీ హోం మంత్రి అయ్యారు.