ఈ పట్నం జనాలు ఉత్తుత్తి మాటలు తప్పితే… చేతల దగ్గరికొచ్చేసరికి ఎవరి పని వారిదే అని మరోసారి నిరూపించుకున్నారు. ఓటు మన ఆయుధం, అందరూ తప్పకుండా ఓట్లు వేయాలని ఫేస్‌బుక్ పోస్టులు, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం, నీతులు వల్లించడం తప్ప…. తీరా ఓటింగ్ రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడానికి లక్షా తొంభై సాకులు చెప్తారు. మొత్తం తెలంగాణలో హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైందంటే అంతే కదా మరి అర్థం. ఐకియా స్టోర్ ఓపెనింగ్, కొత్త సినిమాకు బుకింగ్‌లపై చూపినంత ఆసక్తి కూడా ఓటు వేయడంపై చూపలేదు నగరవాసులు.
చదువుకున్న నిరక్షరాస్యులు:
తెలంగాణలో అత్యధిక శాతం అక్షరాస్యత ఉన్న జిల్లా హైదరాబాద్. కానీ ఓటింగ్ దగ్గరికొచ్చేసరికి అన్ని పాత జిల్లాలు, కొత్త జిల్లాలు ఎలా చూసుకున్నా అన్నిటికంటే చివరన ఉంది. అక్షరాస్యత తక్కువగా ఉండే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల కంటే చాలా వెనుకంజలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇతర జిల్లాల ఓటింగ్ శాతంతో కాబోయే విశ్వనగరం హైదరాబాద్ ఓటింగ్ శాతాన్ని పోల్చడం ఆ జిల్లాలను, అక్కడి ఓటర్లను అవమానించడమే అవుతుంది.
తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ జిల్లాల వారీగా పోలింగ్ వివరాలను వెల్లడించారు. ఇవి చూస్తే హైదరాబాద్ ఓటర్ల నిర్లిప్తత, బద్దకం, అజ్ణానం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. మొత్తం మీద 73.2 శాతం పోలింగ్ నమోదైనట్టు రజత్ కుమార్ చెప్పారు. మీరే చూడండి వివరాలు:
ఆదిలాబాద్ జిల్లా – 83.37 శాతం
నిర్మల్ జిల్లా – 81.22 శాతం
నిజామాబాద్ జిల్లా -76.22 శాతం
కామారెడ్డి జిల్లా – 83.05 శాతం
జగిత్యాల జిల్లా – 77.89 శాతం
పెద్దపల్లి జిల్లా – 80.58 శాతం
కరీంనగర్ జిల్లా – 78.30 శాతం
సిరిసిల్ల జిల్లా – 80.49 శాతం
సంగారెడ్డి జిల్లా – 81.94 శాతం
మెదక్ జిల్లా – 88.24 శాతం
సిద్దిపేట జిల్లా – 84.26 శాతం
రంగారెడ్డి జిల్లా – 61.29 శాతం
వికారాబాద్ జిల్లా – 76.87 శాతం
మేడ్చల్ జిల్లా – 58.85 శాతం
హైదరాబాద్ జిల్లా – 48.89 శాతం
మహబూబ్‌నగర్ జిల్లా – 78.42 శాతం
నాగర్‌కర్నూల్ జిల్లా – 82.40 శాతం
వనపర్తి జిల్లా – 86.15 శాతం
నల్గొండ జిల్లా – 86 శాతం
యాదాద్రి జిల్లా – 90.95 శాతం
జనగాం జిల్లా – 87.39 శాతం
వరంగల్ జిల్లా – 89.68 శాతం
భూపాలపల్లి జిల్లా – 83.21 శాతం
ఖమ్మం జిల్లా – 85.99 శాతం