ముందుగా చెప్పినట్టుగానే తెలంగాణలో పోలింగ్ అయిపోగానే ఆంధ్రా ఆక్టోపస్ మీడియా ముందుకు వచ్చారు. తన ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించారు. అయితే లగడపాటి కంటే ముందే జాతీయ చానళ్లు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయడంతో లగడపాటికి కొంత చిక్కు వచ్చి పడింది. జాతీయ చానళ్లన్నీ టీఆర్ ఎస్‌దే మళ్లీ అధికారమని తేల్చాయి. లగడపాటి మాత్రం తన సర్వేలో ప్రజాకూటమికి మెజారిటీ స్థానాలు వస్తాయని చెప్పాడు
పోలింగ్ శాతం గురించి:
లగడపాటి ముందు పోలింగ్ శాతం నుంచి మొదలెట్టాడు. 72-75 శాతం వరకు జరిగి ఉండొచ్చనాడు. కానీ ఎన్నికల సంఘం 67-68 శాతం దగ్గర ఉంది. పోలింగ్ శాతం పెరిగితే ప్రజా కూటమికే అనుకూలమని లగడపాటి పునరుద్ఘాటించాడు. తెలంగాణ ప్రజల్లో ప్రేమ, కసి, జాలి, ఆశ ఉన్నాయని, ఎన్నికల్లో ఇవన్నీ ప్రభావం చూపించాయని చెప్పారు. అంతేగాదు… ఉత్తరాది మీడియాకు, చానళ్లకు ఇవి అర్థం కావని కొట్టిపారేశాడు.
ఒక 10 సీట్లు అటో ఇటో…
లగడపాటి సర్వే ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకునే సీట్లు ఇవీ….
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి: 65 సీట్లు (10 అటో ఇటో)
టీఆర్ ఎస్: 35 సీట్లు (10 అటో ఇటో)
తెలుగుదేశం: 7 (2 అటో ఇటో)
బీజేపీ: 5 సీట్లు (2 అటో ఇటో)
ఎంఐఎం: 6 నుంచి 7 సీట్లు
ఇండిపెండెంట్లు: 5 నుంచి 7 సీట్లు
బీఎల్ఎఫ్ / సీపీఎం: 1 సీటు
టీఆర్ ఎస్‌కు చాన్స్ ఉందిగా….
లగడపాటి లెక్కను జాగ్రత్తగా పరిశీలిస్తే టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. తాను చెప్పినదానికి ఒక 10 సీట్లు అటో ఇటో అన్నాడు కాబట్టి… 35కి ఒక 10 సీట్లు ఇటేసుకుంటే 45 అవుతాయి. ఎంఐఎం 7, బీజేపీ 5, ఇండిపెండెంట్లు 7 కూడా కలుపుకుంటే 64 సీట్లు అవుతున్నాయి. కేసీఆర్‌కి కావాల్సింది 60 సీట్లే కదా..? ఏమో చూద్దాం. గుర్రం ఎగరావచ్చు!