కేసీఆర్ అనూహ్యంగా కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడంతో టీఆర్ఎస్లో కొంత రాజకీయ సందడి మొదలైంది. కేటీఆర్ పార్టీలో ఎప్పటి నుంచో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారికంగా హరీష్‌రావు, మిగతా నాయకులతో సమాన స్థాయిలోనే ఉన్నారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా రావడంతో కేటీఆర్ సహజంగానే పార్టీలో రెండో స్థానంలో ఉంటారు. పార్టీలో తనకంటే సీనియర్, మంచి వ్యూహకర్త, మాస్ లీడర్‌గా పేరున్న బావ హరీష్‌రావుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గకుండా చూసుకోవడం కూడా కేటీఆర్ బాధ్యత కానుంది. ఎలాంటి అసమ్మతి తలెత్తినా అది నాయకత్వ లోపం కిందికే వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హరీష్‌రావు రాజకీయంగా ఎదగడానికి పెద్దగా అవకాశాలు లేదు. కీలకమైన మంత్రి పదవి వస్తే కొంతవరకు తన ప్రాధాన్యాన్ని నిలుపుకోవచ్చు.
హరీష్‌రావు ప్రస్తుతానికి అయితే చేయగలిగింది ఏమీ లేదు. టీఆర్ ఎస్‌కు భారీ మెజారిటీ రావడం, కేసీఆర్ మరింత బలోపేతం కావడం వల్ల పార్టీలో అసంతృప్తిని ఏ మాత్రం కేసీఆర్ సహించకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని హరీష్‌రావు పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంలో కొనసాగడం మొదటి ఆప్షన్.
మంత్రి పదవుల కేటాయింపు, పార్టీ వ్యూహాల్లో భాగస్వామ్యం, నాయకులకు అందుబాటులో ఉంటూ వారి పనులు చేసిపెట్టడం వంటి విషయాల్లో హరీష్‌రావు మాటకు కేటీఆర్ ఏమేరకు విలువ ఇస్తారనేది చూడాలి. మనస్తత్వం పరంగా కూడా హరీష్‌రావు కేటీఆర్ కంటే సౌమ్యుడిగా పేరుంది. కార్యకర్తలను, పార్టీని డీల్ చేయడంలో కూడా ఇద్దరి మధ్య తేడా ఉంది. కేటీఆర్ అగ్రెసివ్నెస్ వల్ల హరీష్ రావుకు ఇబ్బంది ఎదురైతే దీర్ఘకాలంలోనైనా సమస్యలు రాక మానవు.
ఇప్పటికప్పుడు సొంత కుంపటి పెట్టుకునే ఆలోచనలు కూడా హరీష్‌రావుకు రాకపోవచ్చు. టీఆర్ ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నందువల్ల నాయకత్వం ఎలాంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం లేదు. కేసీఆర్ కూడా వారసత్వం ఒక చర్చనీయ అంశం కాకుండా ముందుగానే తేల్చేశారు. రానున్న ఐదేళ్లలో కేటీఆర్ పార్టీపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంది. అదీగాక రానున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మించడం అవసరం. దీనివల్ల సహజంగానే కేటీఆర్ పార్టీపై పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంది.