ప్ర‌చారం క‌ళ్ల‌ద్దాల పంపిణీకేనా… సెక్ర‌టేరియ‌ట్ శంకుస్థాప‌న‌కు వ‌ద్దా?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు, తెలుగుదేశం, చంద్ర‌బాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేకెత్తించాయి. మొత్తం ప్ర‌సంగం విన్న‌వారికి క‌లిగే మొద‌టి అభిప్రాయం…. కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడా అనే సందేహం వ‌స్తుంది. నిజానికి ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ కానీ, జ‌న‌సేన కానీ గ‌తంలో చేసిన విమ‌ర్శ‌లు, తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు అంత సంచ‌ల‌నం కాలేదు. కానీ కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌కు తెలుగుదేశం కూడా తీవ్రంగా స్పందించింది. దీంతో మ‌రోసారి భావోద్వేగ పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంది.

కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల్లో అత్యంత ప్ర‌ధాన‌మైంది.. ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు చంద్ర‌బాబు శంకుస్థాప‌న‌. రాఫ్ట్ టెక్నాల‌జీ ద్వారా సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం చేప‌డుతూ శంకుస్థాప‌న చేయ‌డం ఏపీ గొప్ప విష‌యంగా చెప్పుకోవ‌డాన్ని కేసీఆర్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. హైద‌రాబాద్‌లో వంద‌ల కొద్దీ బిల్డింగ్‌లు ఇదే టెక్నాల‌జీతో క‌ట్టార‌ని చెప్పారు. కానీ చిన్నా చిత‌క ఆఫీసులు వేరు, 60 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం వేరు క‌దా కేసీఆర్ గారు… నేల తీరును బట్టి నిర్మాణంలో సాంకేతిక ప‌రిజ్ఞానం వాడ‌టం స‌హ‌జం. సెక్ర‌టేరియ‌ట్ చాలా పెద్ద నిర్మాణం కాబట్టే దాన్ని ప్ర‌త్యేకంగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌చారం చేసింది. అందులో త‌ప్పేముంది?

ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే… రాజ‌ధాని, క‌నీస పాల‌నా సౌక‌ర్యం లేని రాష్ట్రంలో కీల‌క‌మైన సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసుకునేట‌ప్పుడు పండ‌గ లాగ‌నే చేసుకుంటారు. అది వారి చాలా ముఖ్య‌మైన నిర్ణ‌యం. ఆ సంద‌ర్భంగా టీవీల్లో, పేప‌ర్ల‌లో ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకుంటే దాన్ని ఆక్షేపించాల్సిన అవ‌స‌రం ఏముంది కేసీఆర్ గారూ. కంటివెలుగు ప‌థ‌కం కింద క‌ళ్ల‌ద్దాలు పంపిణీ చేసేట‌ప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అంత‌కంటే ఎక్కువ ప్ర‌చారం చేసుకున్న విష‌యం మ‌ర్చిపోతే ఎలా?

వాళ్ల తెలివితేట‌లు, ఉన్న వ‌న‌రుల ఆధారంగా సెక్ర‌టేరియ‌ట్ క‌ట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ అక్క‌డ ఎలాగూ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు. ఏపీలో ఉన్న భావోద్వేగాల రీత్యా వైసీపీగానీ, జ‌న‌సేన గానీ ప్ర‌త్య‌క్షంగా మీతో క‌లిసే అవ‌కాశం లేదు. స‌రే, అది ప్ర‌జ‌ల‌ను మభ్య‌పెట్ట‌డానికా, మోసం చేయ‌డానికా, నిజంగానే అక్క‌డ సెక్ర‌టేరియ‌ట్ క‌డ‌తారా, క‌డితే ఎంత బాగా కడ‌తారు, దాన్ని ప్ర‌జ‌లు ఆమోదిస్తారా లేదా అనేది ఎన్నిక‌ల్లో తేలుతుంది.