తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన బలంతో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్‌కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. దీంతో కేసీఆర్ వారసత్వంపై అపోహలు, అనుమానాలు సద్దుమణిగినట్టే అని చెప్పవచ్చు. ఇది అధికారికంగా కేసీఆర్ తర్వాత కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగుమం చేస్తుంది. ఇక ప్రభుత్వ పగ్గాలు గురించి చెప్పడానికి ఏముంటుంది. ఆటోమేటిక్‌గా పార్టీ నేతకే ప్రభుత్వ పగ్గాలు కూడా దక్కుతాయి కదా.
జాతీయ రాజకీయాలే కారణమా?
కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నట్టు తాను జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక విధంగా ఇది పార్టీలో, ప్రభుత్వంలో వారసత్వానికి సంబంధించిన ప్రశ్నే. జాతీయ రాజకీయాల్లో తాను క్రియాశీలం అయితే ఇక్కడ ప్రభుత్వానికి, పార్టీ వ్యవహారాలను డోకా లేకుండా నడిపించగలిగే సత్తా కేటీఆర్‌కు ఉందని కేసీఆర్ నమ్మకం. అందుకే ఈ కిరీటం.
మరి హరీష్‌రావు పరిస్థితి ఏంటి?
టీఆర్ ఎస్‌లో వారసత్వం గురించి ప్రస్తావన వస్తే హరీష్ రావు పేరు కూడా వస్తుంది. కేటీఆర్ కంటే రాజకీయ అనుభవం ఎక్కువగా ఉన్న హరీష్ రావుకు పార్టీలో ఎలాంటి స్థానం ఉందనేది చర్చనీయాంశం అవకమానదు. నాయకత్వ లక్షణాల విషయంలోనూ కేటీఆర్ కంటే హరీష్ మెరుగని చెప్పవచ్చు. గ్రామ స్థాయి వరకు నాయకులతో, క్యాడర్‌తో నిరంతరం టచ్‌లో ఉంటూ పార్టీని నడిపించడం హరీష్‌కు అలవాటుగా చెబుతారు. ఈవిషయంలో కేసీఆర్‌తో ఎంతో కొంత పోల్చదగిన వ్యక్తి హరీష్‌రావని చెప్పవచ్చు.
అయితే ప్రస్తుతం కేసీఆర్ ఉన్న బలమైన సానుకూల పరిస్థితుల్లో హరీషరావు చేయగలిగిందేమీ ఉండకపోవచ్చు. కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాగే, వ్యవహరించే ధైర్యం టీ ఆర్ ఎస్‌లో హరీష్ రావుకే కాదు, ఇంకెవరికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. అయితే పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ హరీష్ రావుకు ఏ మేరకు స్వేచ్ఛ ఇస్తారు, హరీష్ మాటకు ఎంత విలువ ఉంటుందనేది చూడాలి.