కేసీఆర్ – నరేంద్ర మోదీ మధ్య పరోక్ష మైత్రి బంధానికి ప్రతీకగా ఓ సంఘటన జరిగింది. విశాఖ మీదుగా, ఒడిషా, కోల్‌కతా దాటి ఢిల్లీ చేరిన కేసీఆర్, నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా (టీఆర్ఎస్ నాయకుల మాటల్లో) కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఓ 16 అంశాలను మోదీ దృష్టికి తీసుకొచ్చినట్టు టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, ఢిల్లీలో ఏపీ భవన్ విభజన, హైకోర్టు విభజన… ఇలా ఓ జాబితా మోదీకి సమర్పించారు.
ఇలా మీటింగ్ అయిందో లేదో వెంటనే హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం విశేషం. జనవరి 1, 2019 నుంచి ఏపీ హైకోర్టు అమరావతిలో కొనసాగనుంది. తాత్కాలిక భవన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. న్యాయమూర్తుల విభజన, ప్రధాన న్యాయమూర్తుల నియామకం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ హైకోర్టుకు 10 మంది, ఏపీ హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ విభజన జరిగిపోయింది.
ఎప్పటికైనా హైకోర్టు విభజన తప్పదు. కానీ టీఆర్ఎస్ – బీజేపీల మధ్య రహస్య అవగాహన ఉందని తెలుగుదేశం, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి తాజా సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, తర్వాతే మోదీ ఏపీలో అడుగుపెట్టాలని ఏపీలో తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. అలాంటిది విభజన చట్టంలోని హామీలను నెరవేర్చుకోవడంలో కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
నరేంద్ర మోదీని కేసీఆర్ కలిసిన వెంటనే హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి భవన్ జారీచేయడం కేసీఆర్ రాజకీయ సమర్థతకు చిహ్నం. ఎన్నికల తర్వాత కేసీఆర్ నిజంగా బీజేపీకి మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహాస్పదమే. కానీ బీజేపీ నాయకత్వం కేసీఆర్ ట్రాప్‌లో పడినట్టు అనిపిస్తుంది. దటీజ్ కేసీఆర్ సర్.