హ‌రీష్‌రావు మ‌ళ్లీ నీళ్ల మంత్రి అయ్యేనా..?

తెలంగాణ‌లో, ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ పార్టీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయ్‌. బంప‌ర్ మెజారిటీ ఇచ్చిన బ‌లంతో కేసీఆర్ అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్న‌ట్టు ఇప్ప‌టికే అనేక సందేశాలు వెలువడ్డాయి. వాటిలో అత్యంత కీల‌కమైంది కేటీఆర్‌ను టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేయ‌డం. తాజాగా నిన్న (15 డిసెంబ‌రు) కేసీఆర్ జ‌రిపిన నీటి పారుద‌ల ప్రాజెక్టుల సమీక్షా స‌మావేశంలో హ‌రీష్‌రావు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది.

harish rao at kaleswaram

మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేర్లు వింటే గుర్తొచ్చేది హ‌రీష్ రావు పేరే. నీటి పారుద‌ల శాఖ మంత్రి త‌న‌దైన ముద్ర ఆయ‌న వేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో కోటి ఎక‌రాల మాగాణి లక్ష్యం నెర‌వేరాలంటే హ‌రీష్‌రావు మ‌ళ్లీ నీళ్ల మంత్రి కావాల్సిందేన‌ని చెప్పారు. కానీ కీల‌క‌మైన స‌మావేశంలో హ‌రీష్ రావు లేక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

అదీగాక‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో పాల్గొన‌డం మ‌రింత చర్చనీయాంశమైంది. దాదాపు ఏడు గంట‌ల‌పాటు సాగిన స‌మావేశంలో ఎక్క‌డా హ‌రీష్ జాడ, ప్ర‌స్తావ‌న క‌నిపించ‌లేదు. ఇంకా మంత్రి వ‌ర్గం ఏర్ప‌డ‌క‌పోయినా, హ‌రీష్ రావు మంత్రి కాక‌పోయినా స‌రే… ఆ శాఖ‌తో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం రీత్యా హ‌రీష్‌రావుకు అక్క‌డ త‌ప్ప‌కుండా ఉండాల్సిన వ్య‌క్తి. ఇప్ప‌టివ‌ర‌కు సాగునీటిపై కేసీఆర్ నిర్వ‌హించిన ఏ స‌మావేశ‌మూ హ‌రీష్‌రావు లేకుండా జ‌ర‌గ‌లేదు.

దీంతో హ‌రీష్‌రావుకు మ‌ళ్లీ నీళ్ల మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా లేదా అనే చ‌ర్చ షురూ అయింది. మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌, బాల్కొండ ప్ర‌స్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి నీళ్ల శాఖ అప్ప‌గించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రి హ‌రీష్ రావు ఏ శాఖ ఇస్తార‌నేది స‌స్పెన్సే. హోం శాఖ కూడా ఖాళీగా లేదు. ఇక మిగిలింది ఆర్థిక శాఖ లేదా రెవిన్యూ శాఖ‌. ప‌రిణామాలు చూస్తుంటే అస‌లు మంత్రివ‌ర్గంలోకి హ‌రీష్‌రావును తీసుకుంటారా అనే సందేహాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.