గత రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశాన్నంటుతున్న రియల్ ఎస్టేట్ ధరలు త్వరలోనే కరెక్షన్‌కు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సొంత ఇల్లు ఇప్పటికీ చాలామందికి కలగానే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ మాట అటుంచి, ప్రధాన నగరానికి 20 కిలోమీటర్ల లోపన ఫ్లాట్‌ల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్నికలు కూడా పూర్తయి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో ఇళ్లు, స్థలాల ధరలకు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. అయితే జీఓ 111 కు సంబంధించి జరుగుతున్న పరిణామాల వల్ల కొన్ని ప్రాంతాల్లోనైనా ధరలు దిగొచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్‌కు ఒకప్పుడు మంచినీటికి ప్రధాన వనరుగా ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి వాణిజ్య, భారీ నిర్మాణాలకు అనుమతి లేదు. 84 గ్రామాల్లో ఈ నిషేధం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూములు అమ్మేవారున్నా కొనేవారు లేరు. ఈ ప్రాంతాలు దాటిన తర్వాత వచ్చే మోకిల, కోకాపేట, శంకర్‌పల్లి వంటి ప్రాంతాల్లో మాత్రం భూముల ధరలు బాగా పెరిగాయి. దీంతో జీఓ 111 పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ జీఓను తీసేయాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు జీఓ 111ను ఎత్తేస్తామని హామీ ఇచ్చాయి. కేసీఆర్ కూడా ఎవరూ భూములు అమ్ముకోవద్దని, అధికారంలోకి రాగానే జీఓ 111 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పర్యావరణ వాదులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లడంతో కొంత ఆలస్యం జరిగింది. తాజాగా గ్రీన్ ట్రిబ్యునల్ జీఓ 111 విషయంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఇక ప్రభుత్వం ఈ జీఓను తీసేయడమే మిగిలింది.
హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీళ్లు వస్తున్నందున ఇక మంజీరా వాటర్ అవసరం గతంలోలా లేదని తెలంగాణ ప్రభుత్వ వాదన. జీఓ 111 వల్ల చాలా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ప్రభుత్వం వాదిస్తోంది. పర్యావరణ, మానవ హక్కుల వాదులు మాత్రం రియల్ ఎస్టేట్ ఒత్తిళ్ల వల్ల ప్రభుత్వం ఈ జీఓపై గట్టిగా లేదని ఆరోపిస్తున్నారు. వ్యవహారం త్వరలోనే సుప్రీంకోర్టుకు చేరే అవకాశం ఉంది. ఈ పరిణామాల వల్ల ఆయా ప్రాంతాల్లో ధరలు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది.