ప్రజాకూటమి ఆద్యంతం ఆసక్తికరంగానే ఉంది. పొత్తుల ప్రకటన దగ్గర్నుంచి సీట్ల పంపకం, రెబెల్స్, అసమ్మతులు, ప్రచారం.. మొత్తం రసకందాయంతోనే నడిచింది. లాస్ట్ పంచ్ అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలింగ్ ముందు రోజు రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి కాకుండా, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. పోలింగ్‌కు ముందే కూటమి పరువు పోయింది. ఇప్పుడు అక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరమే.
తెలుగుదేశం పరిస్థితి మరీ దారణంగా ఉంది. పొత్తు బానే ఉందిగానీ సీట్ల విషయంలో మరీ ఇంతగా రాజీపడాల్సిన అవసరం ఆ పార్టీకి ఏం వచ్చిందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. పొత్తులో భాగంగా 14 సీట్లు టీడీపీకి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక నాటికి ఒకటి తగ్గించి 13 సీట్లు అన్నారు. ఇబ్రహీంపట్నం వ్యవహారంతో టీడీపీకి 12 సీట్లే వచ్చినట్టు.
లగడపాటి సర్వేనే కారణమా?
ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గెలుస్తాడని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. తెలుగు దేశం అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ రంగారెడ్డికి మొదటి నుంచీ అక్కడ పోటీ చేయడం ఆసక్తి లేదు. ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తే ఇబ్రహీం పట్నం ఇచ్చారని చంద్రబాబు దగ్గరే వాపోయాడు. మల్రెడ్డి రంగారెడ్డిదీ ఇదే పరిస్థితి. కాంగ్రెస్ టికెట్ ఆశించి, టీడీపీతో పొత్తువల్ల బీస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. ఈ పరిస్థితుల్లో గెలిచే అభ్యర్థికి మద్దతు ఇస్తే తర్వాత పనికొస్తాడనే ఉద్దేశంతో కాంగ్రెస్ మల్‌రెడ్డికి మద్దతు ప్రకటించింది. ఇక మల్రెడ్డి విజయం దాదాపు ఖరారైనట్టేనా?