తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న సందేహం పార్టీలను, ప్రజలను కూడా వెంటాడుతోంది. లగడపాటి రాజగోపాల్ సర్వేతో టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. టీఆర్ ఎస్ మెజారిటీ పట్ల ధీమాగా ఉన్నప్పటికీ, బీజేపీ కొంచెం ముందుకొచ్చి మద్దతు ఆఫర్ చేసింది. టీఆర్ ఎస్ మాకు అవసరం లేదంటుంది కానీ, రేపు ఫలితాల రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోక తప్పదు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఫలితాల మీద పూర్తి ఆత్మవిశ్వాసంతో లేనట్టు కనిపిస్తుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కు తక్కువ సీట్లు వస్తే పరిస్థితి ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతుంది. ఎందుకైనా మంచిదని మజ్లిస్ అసదుద్దీన్ ఒవైసీతో కాంగ్రెస్ పెద్దలు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. బీజేపీ – టీఆర్ ఎస్ రహస్య మైత్రిని బూచిగా చూపి, తమకు మద్దతిచ్చేలా మజ్లిస్ నేతలను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు అహ్మద్ పటేల్ మజ్లిస్ నాయకులతో మాట్లాడినట్టు సమాచారం.
అయితే మజ్లిస్ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదని రాజకీయ వర్గాల కథనం. సోనియా గాంధీపై విశ్వాసం ఉన్నప్పటికీ, రాహుల్ నాయకత్వం, గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ల వ్యవహార శైలి, తెలంగాణలో మళ్లీ చంద్రబాబు జోక్యం వంటి కారణాలతో మజ్లిస్ కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించకున్నట్టు సమాచారం.
అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలను దృష్టిలో ఉంచుకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత మజ్లిస్ నిర్ణయంలో ఏమైనా మార్పు రావచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ గనుక రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీని ఓడిస్తే, మజ్లిస్ కూడా కాంగ్రెస్ పట్ల కొంత మెత్తబడే అవకాశం లేకపోలేదు.