తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి 20 రోజులయింది. ఆరోజు కేసీఆర్‌తోపాటు హోం శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. త్వరలోనో క్యాబినెస్ విస్తరణ ఉంటుందిలే అనుకున్నారు అంతా. కానీ ఇద్దరు మంత్రులతోనే తెలంగాణలో పాలన నడుస్తోంది. మిగతా మంత్రివర్గం ఎప్పుడు ఉండొచ్చనే దాని గురించి టీఆర్ఎస్ నాయకుల్లో రకారకాల ఊహాగానాలు ఉన్నాయి.
అన్నిటికంటే ముఖ్యమైన వాదన, కారణం… మంచి రోజులు లేకపోవడం. కేసీఆర్‌కు ముహూర్తాలు, శకునాలు అంటే బాగా పట్టింపు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అసెంబ్లీ రద్దు దగ్గర్నుంచి అభ్యర్థుల ప్రకటన, ప్రచారం, ప్రమాణ స్వీకారం… ఇలా అన్నీ ముహూర్తాల ఆధారంగానే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గ విస్తరణకు కూడా ఇప్పట్లో మంచి ముహూర్తం లేదని చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి 4వ తేదీవరకు మంచి రోజులు లేవని సమాచారం. అందువల్ల మరో నెలరోజులుపాటు కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరే మంత్రివర్గంగా ఉండే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ శ్రేణుల్లో ఇంకో వాదన కూడా ఉంది. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు టీఆర్ ఎస్‌లో చేరడం గురించి ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఓ 8 మంది ఎంఎల్ఏలను టీఆర్ ఎస్ వైపు లాగాలి. అప్పుడు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఉండదు. ఇప్పటికే మండలిలో ప్రతిపక్షం లేదు. శాసనసభలో కూడా ఇలాగే చేస్తే ఓ పని అయిపోతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
అలా టీఆర్ ఎస్‌లో చేరేవారికి ఏదో ఒక ఆశ చూపాలి. మంత్రివర్గంలో కొందరికైనా చోటు కల్పించాలి. అందుకే ఇది కూడా తేలిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని టీఆర్ ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.