తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ఏపీలో భారీగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నట్టు సమాచారం. ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ, గందరగోళం ఉండటంతో బెట్టింగ్‌లు పెరుగుతున్నాయి. అంతేకాదు… ఎగ్జిట్ పోల్స్‌లో ఒకదానికొకటి పొంతన, స్పష్టత లేకపోవడం, లగడపాటి సర్వే మరో రకంగా ఉండటం, అన్ని పార్టీలు ఓటింగ్ శాతం పెరగడంపై ధీమాగా ఉండటం, ఇవన్నీ బెట్టింగ్ రాయుళ్లకు కునుకు పట్టనివ్వడం లేదు.
ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తున్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రేవంత్‌రెడ్డి పోటీ చేసిన కొడంగల్, కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ స్థానాలపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని మీడియా మిత్రులకు, స్థానికంగా ఉండే విశ్లేషకులకు ఫోన్‌లు చేసి ఎప్పటికప్పుడు ఎవరు గెలుస్తారా అని ఆరాలు తీస్తున్నారు.
సర్వేలు, పార్టీల ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, మీడియా రిపోర్టుల ఆధారంగా బెట్టింగ్‌లు మారుతున్నాయి కూడా. కూకట్‌పల్లిలో సుహాసిని గెలుపుపై పెద్దగా సందేహాలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఆమె ఎంత మెజారిటీ సాధిస్తారనేదానిపైనే ఎక్కువమంది బెట్టింగ్ కట్టినట్టు తెలుస్తోంది. గజ్వేల్ మీద కూడా కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం.