ఎంతో ఉత్సుకత రేపుతున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమైంది. ఈనెల పదో తేదీన వసంత పంచమి అయినందున ముహూర్తం బాగుందని పండితుల సలహా మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సమాచారం. కొత్త మంత్రివర్గంలో సగం మందిపైనే పాత వాళ్లు ఉండే అవకాశం ఉంది.

కొత్త మంత్రివర్గంలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు.. ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావ్, తలసాని శ్రీనివాస యాదవ్, గుత్తా సుఖేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావును కూడా మంత్రివర్గంలోకి తీసుకొని ఎమ్మెల్సీ పదవి ఇస్తారని సమాచారం. తుమ్మల గత ఎన్నికల్లో ఓడిపోయారు.
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవచ్చని సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో వీరిద్దరూ కీలకం కానున్నారు కాబట్టి ప్రస్తుతానికి వీరిని పక్కన పెట్టనున్నారని తెలుస్తోంది. హరీష్రావు ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల తర్వాత కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.