త‌రిమికొట్టుడు భాష వ‌ల్ల తెలంగాణ‌లో ఇంకా ఓట్లు వ‌స్తాయంటారా?

తెలంగాణ ఎన్నిక‌ల వ‌ల్ల మ‌రోసారి ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. సీమాంధ్ర ప్ర‌భావం ఉన్న సీట్ల కంటే మిగ‌తా తెలంగాణ మొత్తం మీద ప్ర‌యోజ‌నం ఎక్కువ‌గా ఉంటుంద‌ని భావించి టీఆర్ ఎస్ మ‌రోసారి ఆంధ్ర – తెలంగాణ విభ‌జ‌న‌ను ముందుకు తెస్తుంది. ఇందులో భాగంగానే చంద్ర‌బాబును విధానాల ప‌రంగా గాక, ఆయ‌న ఎక్క‌డ నుంచి వ‌చ్చాడ‌నేది విమ‌ర్శల్లో క‌నిపిస్తుంది.

టీఆర్ ఎస్ నాయకుల ప్ర‌సంగాల్లో ఈ మాట‌లు చూడండి..

కేసీఆర్‌: చ‌ంద్ర‌బాబును తరిమికొట్టాం… మ‌ళ్లీ కాంగ్రెసోల్లు మ‌న మీద‌కు తేవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.
హ‌రీష్‌రావు: చ‌ంద్ర‌బాబును తెలంగాణ పొలిమేర‌లు దాటించి వెళ్లగొట్టాం… మ‌ళ్లీ వ‌స్తుండు జాగ్ర‌త్త‌.
కేటీఆర్‌: చ‌ంద్రబాబు అంతుచూస్తాం. త‌రిమికొడ‌తాం. ఆంధ్రాలో మేం వేలుపెడ‌తాం.

ఇటీవ‌ల వ‌ర‌కు కాళేశ్వ‌రం, రైతుబంధు, గొర్రెల పంపిణీ, క‌ళ్యాణ ల‌క్ష్మి, పించ‌న్లు చూసి ఓటెయ్యండ‌న్న టీఆర్ ఎస్ స‌డెన్‌గా రూటు మార్చి చంద్ర‌బాబును త‌రిమికొట్టంది అనే ప‌ల్ల‌వి ఎత్తుకుంది. అంటే అభివృద్ధి కంటే సెంటిమెంట్ మీద‌నే మ‌ళ్లీ గెల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. కానీ తెలంగాణ ఏర్ప‌డ్డాక కూడా ప్ర‌జలు ఇంకా ఆంధ్ర – తెలంగాణ సెంటిమెంట్ చూసే ఓటేస్తారా? అనేది చూడాలి.