తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి ఉంది. రెండు నెలల నుంచి కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. నామినేషన్ల పర్వం కూడా మొదలు కాబోతుంది. నాలుగు పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కూటమి కూర్పే ఇంత దారుణంగా ఉంటే, ఇక చంద్రబాబు ప్రయత్నిస్తున్న జాతీయ కూటమి అసలు సాధ్యమేనా? నాలుగు పార్టీల మధ్యే అవగాహనకు రెండు నెలలకుపైగా పడితే, (ఇంకా కుదరలేదు కూడా) డజనుకుపైగా పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందా?
తెలంగాణలోకానీ, దేశంలోకానీ మహాకూటమి / రెండో కూటమి/ మూడో కూటమి అంటూ ఏర్పడితే అందులో కాంగ్రెస్ పాత్ర తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాత్రలో ఉంది. కూటమిలో మిగతా పార్టీలది కూడా అదే పరిస్థితి. వీళ్లంతా రేపు అన్ని రాష్ట్రాల్లో సజావుగా సీట్లు పంచుకోగలరా.
తెలంగాణ మహాకూటమిలో చిన్న పార్టీలైన సీపీఐ, తెలంగాణా జనసమితి సీట్ల వ్యవహారం తేలలేదు. పెద్దన్న కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై సీపీఐ, తెజస పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమను కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందని సీపీఐ మండిపడుతోంది. ఏ క్షణమైనా కూటమికి రాంరాం చెప్పే అవకాశం ఉంది.
సీపీఐ తమకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపింది. వాస్తవానికి మొదట అయిదు ఇచ్చినా సరే అంది. కాంగ్రెస్ మరీ బెట్టు చేయడం చూసి 9 కావాలంటోంది. కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లకు మించి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ ఆఫర్ ఒకటి ఇచ్చింది. ఇప్పుడు మూడు స్థానాలతో సరిపెట్టుకుంటే భవిష్యత్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తాం అంటుంది. కానీ సీపీఐ భవిష్యత్తు హామీ పట్ల ఆసక్తి చూపించడం లేదు.
ఇక చంద్రబాబు ప్రయోగించనున్న జాతీయ కూటమిలో డజనుకుపైగా పార్టీలున్నాయి. తమతమ రాష్ట్రాల్లో ఈ పార్టీలు తామే కింగ్ మేకర్లు అనుకుంటుంటాయి. మరోవైపు కాంగ్రెస్ మాది జాతీయ పార్టీ అంటుంది. వీళ్ల మధ్య సీట్ల పంచాయతీలు తేలతాయా? ఒకటి రెండు సీట్ల కోసం కూటమికి బైబై చెప్పే పార్టీలు చాలా ఉన్నాయి. మరోవైపు బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. అన్ని ఉప ఎన్నికల్లో దారుణ పరాభవాలే. పరిస్థితిలో కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా?