సాధారణంగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌లు చాలా పేలవంగా ఉంటాయి. అంతా వన్‌సైడ్ వార్‌లాగే ఉంటుంది. చంద్రబాబు చెప్పింది రాసుకోవడం వరకే జర్నలిస్టుల పాత్ర. తర్వాత ప్రశ్నలు అడగొచ్చు అంటారు గానీ, వాటిలో కూడా చంద్రబాబును ఇబ్బందిపెట్టే ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం ఉండదు. ఇలా కొన్నేళ్లు గడిచే సరికి జర్నలిస్టులు కూడా చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకున్నారు. అసలు ప్రెస్ మీట్‌కు కూడా వెళ్లకుండానే చంద్రబాబు ఏమి చెప్పేది తేలిగ్గా రాసేవారున్నారు. ఇలా ఏమాత్రం ఆసక్తి కలిగించని చంద్రబాబు ప్రెస్ మీట్‌లు తెలంగాణ ఎన్నికల పుణ్యమాని కొంచెం ఆసక్తికరంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో చంద్రబాబు పెట్టిన ఎడిటర్ల సమావేశమే ఇందుకు నిదర్శనం.
బీజేపీ, టీఆర్ ఎస్ మధ్య సంబంధాన్ని వివరిస్తూ చంద్రబాబు ఓ చలోక్తి విసిరారు. ‘నేను కొట్టినట్టు నటిస్తా…మీరు ఏడ్చినట్లు నటించండి’ అనే రీతిలో మోదీ, కేసీఆర్ మధ్య సంబంధం నడుస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి చలోక్తులు కేసీఆర్ మీటింగుల్లో, ప్రెస్ మీట్‌లలోనే చూస్తుంటాం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ విధానాన్ని చంద్రబాబు విమర్శించారు. నిన్న మొన్నటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నతెరాస పార్టీ నేతలు ఇప్పుడు హైదరాబాద్‌లో పరిశ్రమలు ఏపీకి తరలిపోతాయని అభ్యంతరం చెప్పడం భావ్యం కాదన్నారు. అలాంటి బెంగ ఏమీ అవసరం లేదని, రెండు రాష్ట్రాల్లో కూడా టీడీపీ ఉన్న ప్రభుత్వాలే ఉంటాయి కాబట్టి ఈ సమస్య ఉండదని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ కాదు… సైబరాబాదే..
తాను కట్టింది హైదరాబాద్ కాదని, సైబరాబాదే అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. దీన్ని తెలంగాణ నాయకులు రామారావు, కవితలే ఒప్పుకున్నారని చెప్పారు. ఈ రెండూ కాదనలేని వాస్తవాలే. అదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగినన్ని రైతు ఆత్మహత్యలు కూడా ఎప్పడూ జరగలేదు. ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు చంద్రబాబు హయాంలో వచ్చాయి. వాటికి ఉపశమనంగా చంద్రబాబు చేసింది ఏమీ లేదు. హైదరాబాద్‌లో పోగుపడిన సంపద తెలంగాణ జిల్లాలకు పోలేదు. ఇది ఒక్క చంద్రబాబు సమస్య కాదు. దశాబ్దాల తరబడి ఏర్పడిన సమస్య. టీ ఆర్ ఎస్ హయాంలో ఈ పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అనేది ప్రజలు నిర్ణయించాల్సిందే.
రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణకు రాలేదని, అందుకే గత ఎన్నికల్లో 15 సీట్లు గెలిచినా 13 సీట్లకే పోటీ చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు న్యాయం చేయడం కోసం నిలబడ్డానని అన్నారు. ఎప్పటిలాగే ఉంటానని ఎడిటర్లతో సమావేశంలో చంద్రబాబు చెప్పారు. సైబరాబాద్‌ను సృష్టించింది తానే అని, ఆధునిక హైదరాబాద్ తన బ్రెయిన్ చైల్డ్ అని ఆయన అన్నారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా గత 20 ఏళ్లుగా హైదరాబాద్ రూపకల్పన జరిగిందని, తొలి తొమ్మిదేళ్లు అభివృద్ధికి అనువైన వాతావరణం సృష్టించింది తానేనని, అది ఆ తరువాత కాంగ్రెస్ హయాంలోనూ కొనసాగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.