టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కేటీఆర్‌కు నేతల తాకిడి ఎక్కువైంది. గతంలో కూడా ముఖ్యనేతే అయినప్పటికీ పార్టీ, పదవుల సంబంధిత నిర్ణయాల్లో కేసీఆరే అంతిమ నిర్ణయం తీసుకునేవారు. కానీ మారిన పరిస్థితుల్లో కేటీఆర్ హవా నడుస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఎదురైతే తప్ప పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్ జోక్యం ఉండటం లేదు. దీంతో నేతలంగా కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నెల కావస్తున్నా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడలేదు. దీంతో ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది. మంత్రి పదవుల అభ్యర్థుల చాయిస్ కేసీఆర్‌దే అయినప్పటికీ, ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడినవారిని కేటీఆర్ రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కేటీఆర్‌తో గతంలో సన్నిహితంగా ఉండే నాయకులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి యువనేతలకు ప్రాధాన్యం పెరగవచ్చని భావిస్తున్నారు.
అలాగే మార్చిలో 8 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో టీఆర్ఎస్ ఖాతాలోకి ఈ సీట్లన్నీ రానున్నాయి. ఇవిగాక పార్టీలు మారి రాజీనామాలు చేసినవారి మరో 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ పదవుల కోసం కూడా ఇప్పటి నుంచే నేతలు కేటీఆర్‌ను సంప్రదిస్తున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారంలో ఉన్న పేర్లు: మహమూద్ అలీ, స్వామిగౌడ్, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, పాతూరి సుధాకర్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, పూల రవీందర్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సుధీర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్.