భారత టెస్ట్ క్రికెట్‌లోకి మరో రాహుల్ ద్రవిడ్ అవతరించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చటేశ్వర్ పుజారా ఫామ్ చూస్తే ఇదే అనిపిస్తుంది. సిరీస్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు చేశాడు. నాలుగో టెస్ట్‌లో 7 పరుగుల దూరంలో ఔటై డబుల్ సెంచరీ చాన్స్ మిస్సయ్యాడు. అయితే సెంచరీల కంటే పుజారా ఓపిక, సహనం, ఆడిన తీరు ప్రశంసనీయం.
లోక్‌శ్ రాహుల్ పూర్ ఓపెనింగ్ లతో క్రికెట్ అభిమానులు అసహనంతో విసుగుచెందిన సమయంలో పుజారా వారిని సంతృప్తి పరుస్తున్నాడు. అన్ని మ్యాచ్‌లలోనూ మంచి స్కోరులతో ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ వస్తున్నాడు. విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. పుజారా 193 పరుగులతో నాలుగో టెస్టులో కూడా భారత్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. డ్రాగా ముగిసినా భారత్ సీరీస్ గెలుస్తుంది. మూడు సెంచరీలతో పుజారా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గెలుచుకోవడం ఖాయం.
ఇక క్రికెట్ అబిమానులు పుజారాను రాహుల్ ద్రవిడ్‌తో పోలుస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతున్న సమయాల్లో రాహుల్ ద్రవిడ్ చూపించే పరిణతి అనన్య సామాన్యం. అందుకే ద్రవిడ్‌ను వాల్ (గోడ) అంటారు. ఇప్పుడు పుజారాను కూడా అభిమానులు ఇలాగే పిలుచుకుంటున్నారు. కొంతమంది పుజారాకు 300 అడుగుల విగ్రహం కట్టాలని కూడా ప్రతిపాదిస్తున్నారు.
పుజారా అనేక సందర్భాల్లో తన బ్యాటింగ్‌కు సంబంధించి రాహుల్ ద్రవిడ్ సలహాలు తీసుకుంటానని చెప్పాడు. టెక్నిక్ విషయంలో ద్రవిడ్ సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పాడు. ద్రవిడ్, పుజారా ఇద్దరూ కూడా టెస్ట్ పరుగుల విషయంలో ఇన్నింగ్స్‌లు, రన్స్ సగటులో సమానంగా ఉన్నారు. భారత టెస్ట్ క్రికెట్‌కు మరో ఆణిముత్యం దొరికినట్టేనా?