భారత మహిళా క్రికెట్‌లోకి మరో తెలుగుతేజం ప్రవేశించింది. తాజాగా న్యూజీలాండ్ పర్యటనకు ప్రకటించిన టీ20 జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి చోటు సంపాదించింది. మిథాలీ రాజ్ ఇప్పటికే భారత మహిళా క్రికెట్‌లో అద్భుతమైన విజయాలు సాధించి అమ్మాయిలకు ప్రేరణగా నిలిచింది. అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి మిథాలీ రాజ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అరుంధతి రెడ్డి ప్రవేశంతో తెలుగు రాష్ట్రముల నుంచి మరింత మంది అమ్మాయిలు క్రికెట్ వైపు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
అరుంధతి రెడ్డి దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆటల్లోనే కాదు.. చదువులో కూడా మంచి ప్రతిభ కనబరిచింది. బోర్డు ఎగ్జామ్స్‌లో సైన్స్ స్ట్రీమ్‌లో 100కి 97 మార్కులు సాధించింది. 11వ ఏట నుంచే అరుంధతి క్రికెట్ ఆడుతోంది. తన ఆసక్తిని గమనించిన తల్లి భాగ్య రెడ్డి కూడా అరుంధతిని ప్రోత్సహించింది. ఇరుగుపొరుగు వారు వారించినా అరుంధతిని క్రికెట్ వైపు ప్రోత్సహించింది. అరుంధతి తల్లి యూనివర్సిటీ స్థాయి వాలీబాల్ ప్లేయర్ కావడం విశేషం. రెండేళ్లు సిటీ బస్‌లో అరుంథతి రెడ్డిని శిక్షణకు తీసుకెళ్లినట్టు భాగ్యరెడ్డి తెలిపారు. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి తనకు రోల్ మోడల్స్ అని అరుంధతి చెప్పింది. జులన్ గోస్వామి స్థానంలో భారత క్రికెట్‌లో అరుంధతి రెడ్డి రాణించే అవకాశం ఉంది. 2017లో సౌత్ సెంట్రల్ రైల్వేస్ టీమ్‌లో చేరడం తన కెరీర్‌లో మలుపుగా అరుంధతి రెడ్డి చెబుతుంది. కెరీర్, ఖర్చుల గురించి స్థిరత్వం వచ్చాక ఆట మీద మరింత దృష్టిపెట్టి రాణించింది.