మహిళా క్రికెట్ టీమ్‌లో మిథాలీ – హర్మన్ ప్రీత్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన బీసీసీఐకి లేఖ రాయడం, అందులో మాజీ కోచ్ రమేష్ పొవార్‌నే కొత్త కోచ్‌గా కొనసాగించాలని కోరడం కొత్త వివాదానికి దారితీసింది. దీనివల్ల క్రికెట్‌లో ఆటగాళ్లకంటే కోచ్‌లకు అనవసరంగా అధిక ప్రాధాన్యం ఏర్పడే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
రమేష్ పొవార్ మంచి కోచే కావచ్చు కానీ, ఆయన కోచ్ కాక ముందే భారత్ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుందని, టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని తృటిలో జారవిడుచుకుందని గుర్తుంచుకోవాలని మంజ్రేకర్ చెప్పాడు. ఇంకొంచెం ముందుకెళ్లి హర్మన్ ప్రీత్ కౌర్ ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తే భారత్ మహిళా క్రికెట్ కు మంచిదని సలహా పూర్వక హెచ్చరిక చేశాడు.
వరల్డ్‌కప్ టీ20 సెమీస్‌లో మిథాలీ రాజ్‌కు జట్టులో చోటుదక్కకపోవడం మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అప్పటివరకు మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీని తుదిజట్టులోకి తీసుకోకపోవడానికి కోచ్ రమేష్ పొవార్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కారణమని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. దీంతో బీసీసీఐ మేల్కొని వ్యవహారాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది.