మిథాలీ రాజ్, మహిళల క్రికెట్ కోచ్ రమేష్ పొవార్ వివాదం అనుకోని మలుపు తిరిగింది. పొవార్ కాంట్రాక్టు ముగియడంతో ఇక అతన్ని సాగనంపుతారని అందరూ అనుకుంటుండగా, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మరో క్రీడాకారిణి స్మృతి మంథన్న తమకు కోచ్‌గా పొవారే కావాలని బీసీసీఐకి లేఖ రాశారు. దీంతో మొత్తం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బీసీసీఐ ఇప్పడు ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది.
హర్మన్ ప్రీత్ కౌర్ తన లేఖలో మిథాలీ ఎంపిక గురించి కూడా ప్రస్తావించింది. మిథాలీని సెమీస్ మ్యాచ్‌కు ఎంపిక చేయకపోవడం సమిష్టి నిర్ణయమని తెలిపింది. బీసీసీఐ కూడా హర్మన్, మంథన్నల లేఖలను నిర్థారించింది. 2021 వరకు తమకు రమేష్ పొవారే కోచ్‌గా ఉండాలని తాము కోరుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారని బీసీసీఐ తెలిపింది.
రాబోయే కీలకమైన సీరీస్‌లను దృష్టిలో ఉంచుకొని ఈ దశలో కోచ్‌ను మార్చడం మంచిది కాదని వారిద్దరూ తమ లేఖల్లో కోరారు. మరోవైపు మిథాలీ అభిమానులు పొవార్‌ను కోచ్‌గా కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా మిథాలీకి మద్దతుగా నిలిచారు. ఫామ్‌లో ఉన్నప్పటికీ తనను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం తీవ్ర తప్పుగా విమర్శించారు.
కొత్త కోచ్‌ను ఎంపిక చేయడానికి డిసెంబరు 14 వరకు బీసీసీఐకి గడువు ఉంది. ఈలోగా వ్యవహారం ఇంకా ఏమైనా మలుపులు తిరుగుతుందా అనేది చూడాలి. ఏదేమైనా దేశంలో మహిళా క్రికెట్‌కు మంచి గుర్తింపు తెచ్చిన మిథాలీ రాజ్‌కు మంచి జరగాలనే ఆమె అభిమానుల ఆకాంక్ష.