దేశంలో రాజకీయ నాయకులకు విగ్రహాల పిచ్చి బాగా ముదురుతున్నట్టు కనిపిస్తుంది. వేలకోట్ల రూపాయలు వెచ్చించి విగ్రహాలు కట్టడానికి రాజకీయ నాయకులు పోటీపడుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం, వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడం తప్పనిసరి. చాలా అవసరం కూడా. కానీ దీనికి వేలకోట్లు ప్రజాధనం ఖర్చుచేసి విగ్రహాలు కడితే సరిపోతుందా? రైతు రుణమాఫీలపై సవాలక్ష లెక్కలు చూపిస్తూ వెనుకంజ వేస్తున్న ప్రభుత్వాలు విగ్రహాలకు వేలకోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టడం మంచిదేనా?
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బీజేపీ ప్రభుత్వం రూ.2989 కోట్లు ఖర్చు చేసింది. సంస్థానాలను విలీనం చేసి భారత దేశానికి ఒక రూపురేఖలు ఇచ్చిన నేత పటేల్. ఐక్యతకు చిహ్నంగా ఈ విగ్రహం కట్టారు. కానీ విధానాల పరంగా బీజేపీ చేస్తున్నది మాత్రం దీనికి భిన్నం. దేవుళ్లకు కులాలు ఆపాదించడం, మతం పేరిట, ఆహారపు అలవాట్ల పేరిట సమాజాన్ని చీల్చడం ఐక్యతను కాపాడతాయా?
ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని కడతామని అంటున్నారు. దీనికి రైతుల నుంచి సేకరించిన వందల ఎకరాలు కేటాయించారు. అసలే ఆర్థికలోటు, డబ్బుల్లేవు అంటున్న ప్రభుత్వం వీటికి వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది? ఎన్టీఆర్ విగ్రహానికి ప్రభుత్వ ధనం కంటే తెలుగుదేశం పార్టీ ఫండ్స్ కేటాయించడం మంచి నిర్ణయం కావచ్చు.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం శివాజీ భారీ విగ్రహం కట్టనున్నట్టు ప్రకటించింది. దీనికి రూ.3643 కోట్లు ఖర్చు చేస్తారట. దేశంలో అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరిగేది మహారాష్ట్రలోనే. దశాబ్దాల నుంచి మహారాష్ట్ర ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంటుంది. చత్రపతి శివాజీ కోరుకున్న సామ్రాజ్యం ఇలాంటిదేనా? అయ్యా నాయకురాలా… మీ దేశభక్తికి జిందాబాద్. అది మీ విధానాల్లో, చేతల్లో చూపించండి. విగ్రహాల్లో కాదు.