ఖాతాలోకి 15 ల‌క్ష‌లు వ‌స్తున్నాయి.. దారిలో ఉన్నాయ‌ట‌

ఆయ‌నెవ‌రో కేంద్ర మంత్రి అథ‌వాలే అంట‌…. భ‌లే జోక్ పేల్చాడు. త్వ‌ర‌లోనే అంద‌రి బ్యాంకు ఖాతాల్లోకి 15 ల‌క్ష‌లు వ‌స్తాయ‌ట‌. అయితే అంత మొత్తం ఒకేసారి వెయ్య‌రంట‌. నెమ్మ‌దిగా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారంట. జ‌నాలు ఈయ‌న‌కు ఎలా క‌న‌బ‌డుతున్నారో్ దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

Ramdas Athawale

2014 ఎన్నిక‌ల స‌మయంలో న‌రేంద్ర మోదీ విదేశాల్లో న‌ల్ల‌ధనాన్ని లాక్కొచ్చి మీ ఒక్కొక్క‌రి బ్యాంకు ఖాతాల్లో 15 ల‌క్ష‌ల చొప్పున వేస్తాన‌ని హామీ ఇచ్చారు. అంతేకాదు… మ‌రి బ్యాంకు ఖాతాలు లేక‌పోతే ఇబ్బంది క‌దా. అస‌లే 15 ల‌క్ష‌లు. జ‌న్‌ధ‌న్ ఖాతాల పేరుతో ముస‌లీ ముత‌కా అంద‌రి చేత ఖాతాలు తెరిపించారు.. ఇక అంతే సంగ‌తులు.

మ‌హారాష్ట్రకు చెందిన రామ్‌దాస్ అథ‌వాలే మంత్రిగా కేంద్రంలో సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ చూస్తున్నారు. నిన్న మ‌హారాష్ట్రలోని ఇస్లామ్‌పూర్‌లో ప‌ర్య‌టిస్తూ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మ‌రి అప్పుడు మోదీ చెప్పిన 15 ల‌క్ష‌ల సంగ‌తి ఏమైంద‌ని అడిగితే… ఇదిగో ఇలా చెప్పారు… ఆ 15 ల‌క్ష‌లు ఒకేసారి బ్యాంకు ఖాతాల్లో ప‌డ‌వు… నెమ్మ‌దిగా వ‌స్తాయి.

ఈ విలేక‌ర్లూ అంతే… ముందూ వెనుకా చూసుకోకుండా అడుగుతారు.