దివ్య దేవ‌రాజ‌న్‌.. మ‌రో స్ఫూర్తిదాయ‌క క‌లెక్ట‌ర్‌

తెలుగు రాష్ట్రాల్లో మ‌రో మ‌హిళా క‌లెక్ట‌ర్ పేరు మారుమోగుతోంది. గ‌తంలో స్మితా స‌బ‌ర్వాల్‌, ఆమ్ర‌పాలి తెలంగాణ‌లో జిల్లా క‌లెక్ట‌ర్లుగా ప‌నిచేసి ఆయా జిల్లాల ప్ర‌జ‌లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జాభిమానం చూర‌గొన్నారు. క‌లెక్ట‌ర్ ప‌ద‌వితో వ‌చ్చే ద‌ర్పానికి ప్రాధాన్యం ఇవ్వ‌కుండా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై నిత్యం వారి స‌మ‌స్య‌ల‌ను వింటూ ప‌రిష్కారానికి కృషి చేశారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ దివ్య దేవ‌రాజ‌న్ కూడా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Divya Devarajan IAS Adilabad

ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జిల్లాలో విప‌రీత‌మైన చ‌లి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పేద‌వారికి దుప్ప‌ట్లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న‌కు విషెష్ చెప్ప‌డానికి వ‌చ్చేవారు ద‌య‌చేసి పూల బొకేలు తేవ‌ద్ద‌ని, దుప్ప‌ట్లు తీసుకురావాల‌ని కోరారు. అంతేకాదు, జిల్లా వ్యాప్తంగా నైట్ షెడ్ల‌ను ఏర్పాటు చేశారు. ఇల్లు లేనివారు తీవ్ర‌మైన చ‌లికి ఇబ్బంది ప‌డ‌కుండా ఈ షెడ్‌ల‌లో త‌ల‌దాచుకోవ‌చ్చు. క‌లెక్ట‌ర్‌గా దివ్య దేవ‌రాజ‌న్ మాన‌వ‌తా దృక్ప‌థం అంద‌రినీ ఆలోచింప‌చేసేలా ఉంది.

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజ‌నులు ఎక్కువ‌. అందుకే వారి అభివృద్ధి పై దివ్య ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టారు. ఆమె వీలు దొరికినప్పుడ‌ల్లా గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. గిరిజ‌నుల జీవ‌నం, ఇబ్బందుల గురించి తెలుసుకుంటున్నారు. దీనికోసం గోండులు మాట్లాడే భాష‌ను కూడా దివ్య నేర్చుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు ఎక్కువ‌గా చేస్తున్నారు. ఏసీ రూమ్‌ల‌కే ప‌రిమితం అవుతున్న అధికార్లూ.. కొంచెం స్ఫూర్తి పొందండి.