ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ సీఆర్డీఏ చేపట్టిన హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ – 2 సీరీస్ జనవరిలో ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా దీన్ని విడుదల చేయాలని ఏపీ సీఆర్డీఏ భావిస్తుంది. అమరావతికి సమీపంలోని నేలపాడు చేపట్టిన హ్యాపీ నెస్ట్ 1లో 1200 ఫ్లాట్లకు రెండు విడతలుగా నిర్వహించిన బుకింగ్‌లో హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయి. దీంతో హ్యాపీనెస్ట్ 2 సిరీస్‌ను జనవరిలో ప్రారంభించనున్నట్టు ఏపీ సీఆర్డీఏ ప్రకటించింది.
గుంటూరు జిల్లా నేలపాడు వద్ద తొలి దశ హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు రానుంది. సీరీస్ 2 ఎక్కడనేది ఇంకా డిసైడ్ కాలేదు. హ్యాపీ నెస్ట్ 1 బుకింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు పాల్గొన్నారు. మొదటి గంటలోనే 700 ఫ్లాట్స్ బుక్ అయ్యాయి. హ్యాపీనెస్ట్ 2 సీరీస్ కూడా మొదటి సీరీస్ ప్రత్యేకతలతోనే రానుంది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంఖ్య పెంచే అవకాశం ఉంది. మొదటి ఫేజ్‌లో మొత్తం 1200 ఫ్లాట్లలో 100 పైచిలుకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్‌లు ఉన్నాయి.
హ్యాపీ నెస్ట్ – 1 ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఆర్డీఏ 24 నెలల (2 సంవత్సరాల) డెడ్‌లైన్ పెట్టింది. పనులు సంక్రాంతికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫ్లాట్ బేస్ ధర రూ. 3492. ఇతర సౌకర్యాలు, వసతులు అన్నీ కలుపుకుంటే చదరపు అడుగు సుమారు రూ.5000 వరకు పడుతుంది. అనేక ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు కూడా హ్యాపీ నెస్ట్ నివాస ప్రాజెక్ట్ కొనుగోలుదారులకు లోన్లు ఇస్తున్నాయి. బుకింగ్ తర్వాత ఒక నెల రోజుల్లోపల అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం ధరలో 10 శాతం చెల్లించాలి.
హ్యాపీ నెస్ట్‌కు వివపరీతమైన స్పందన రావడంతో సీఆర్డీఏ దీన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావించి నిర్మాణం చేపట్టనుంది. ఫేజ్ 2కు ఇప్పటికి 4000 మందికిపైనే ఆసక్తి చూపించారు. అందువల్ల త్వరలోనే దీనికి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ వివరాలు తెలిసే అవకాశం ఉంది. సంక్రాంతి కానుకగా సీరీస్ 2 వచ్చే అవకాశం ఉంది.