బాబాయ్ కోసం అబ్బాయి స్పెష‌ల్ సాంగ్‌

జ‌న‌సేన పార్టీ ద్వారా రాజ‌కీయాల్లో త‌న‌దైన మార్కు, మార్పు కోసం ప్ర‌యత్నిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మెగా కుటుంబం అండ‌గా ఉంటోంది. అనేక సంద‌ర్భాల్లో మెగా హీరోలు, కుటుంబ స‌భ్యులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు, మాట్లాడుతున్నారు. చిరంజీవి, అల్లు అర‌వింద్‌, నాగ‌బాబు, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌…. ఇలా మెగా కుటుంబం అంతా ప‌వ‌న్ కు త‌మ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.

చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ మ‌రో అడుగు ముందుకేసి గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా బాబాయి ప‌ట్ల త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌న‌సేన కోసం ప్ర‌త్యేకంగా ఒక పాట‌నే రూపొందించి ఫేస్‌బుక్ / యూట్యూబ్ ద్వారా విడుద‌ల చేశారు. దేశం కోసం త్యాగం చేసిన నాయ‌కుల కోసం ఈపాట‌ను అంకితం చేస్తున్న‌ట్టు ఇందులో పేర్కొన్నారు.

రామ్ చ‌ర‌ణ్ రూపొందించిన ఆ పాట ఇలా సాగుతుంది… ఒక‌డొచ్చాడు… వ‌చ్చాడు… మనలను ముందుకు నడప…వచ్చెర ఒకడు…అతడొక గంగానది, అతడొక హిమశిఖరం.. జనగణమనమాతడు- జనసేనై కదిలాడు. జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల నుంచి ఈ పాట‌కు లైకులే లైకులు వ‌స్తున్నాయి.