నాల్రోజులు సెలవులు వచ్చాయి కదా… పండక్కి ఊరెళ్లి సేదదీరుదామనుకున్న నగరవాసులకు రోడ్లమీద చుక్కలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోతుంది. టోల్‌గేట్ల వద్దనే సగం పండగ అయిపోతుంది. 4-5 గంటల ప్రయాణం కాస్తా కనీసం 10 గంటలు పట్టే పరిస్థితి ఉంది. ఇక పండగ అయిపోయిన తర్వాత బుధ, గురువారాల్లో తిరుగు ప్రయాణం ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే జనాలు భయపడుతున్నారు.
హైదరాబాద్, విజయవాడ మధ్య నాలుగు టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్ దగ్గర నుంచి బయటపడేసరికి కనీసం గంట పడుతుంది. ముఖ్యంగా పంతంగి టోల్ గేట్ వద్ద కారుల బారులు సినిమా గ్రాఫిక్ దృశ్యాలను తలపిస్తున్నాయి. పోలీసులు వస్తున్నప్పటికీ వాళ్లు చేసేది కూడా ఏమీ కనిపించడం లేదు.
ఏపీ ప్రభుత్వం టోల్ గేట్ల వద్ద ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి ఎక్కడా అమలు కావడం లేదు. హైదరాబాద్, విజయవాడ మధ్య జాతీయ రహదారి ఉంది. ఇది కేంద్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్ర రోడ్డు మంత్రిత్వ శాఖ చెబితేనే తాము టోల్ వసూలు ఆపేస్తామని ఆపరేటర్లు చెప్పారు. దీంతో ఉపశమనం కనిపించడం లేదు.
ఎందుకైనా మంచిది.. పండక్కి బయల్దేరేవాళ్లు పిల్లలు, పెద్దవారిని దృష్టిలో ఉంచుకొని టిఫిన్లు, వీలైతే భోజనాలు, సరిపడా నీళ్లు వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే భద్రత దృష్ట్యా రాత్రిపూట ప్రయాణం కూడా మానుకోవడం ఉత్తమం. విపరీతమైన పొగమంచు వల్ల ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. శనివారం ఒక్కరోజే రోడ్డు ప్రమాదాల వల్ల 16 మంది మరణించారు.