సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, పేట, ఎఫ్2 సినిమాల వినోదం చాలని వారికి శుభవార్త. కేఏ పాల్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పైన చెప్పిన సంక్రాంతి సినిమాలకు దేనికీ తీసిపోని రీతిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. కాబోయే ఏపీ సీఎం తానేనని, చంద్రబాబు నాయుడు తనకు సలహాదారు కానున్నారని కేఏ పాల్ చెప్పారు. అంతేకాదు… తాను చెప్పినవి ఎప్పుడూ పొల్లు పోలేదని, ఈసారి కూడా జరగడం తథ్యమనీ చెప్పారు.
కేఏ పాల్ ప్రెస్ మీట్‌లో ముఖ్యాంశాలు:
- ఏపీలో నేనే ముఖ్యమంత్రిని, కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా.
- నాకు సలహాదారుగా చంద్రబాబును నియమించుకుంటా.
- జగన్ సీఎం కాలేడు, పవన్ కల్యాణ్‌ది చిన్న పార్టీ, ఆయన ప్రభావం ఉండదు.
- ఏపీలో నేనే సీఎం అని అనేక సర్వేలు ఇప్పటికే నిర్ధారించాయి.
- మోదీకి ప్రత్యామ్నాయం నేనే.
- చంద్రబాబు, జగన్, మోదీ మిత్రులు. వీళ్లలో ఎవరికి ఓటేసినా మోదీకి వేసినట్టే.
- జాతీయ స్థాయిలో 18 పార్టీలతో కూడిన థర్డ్ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయి. నేను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేస్తాను.
- విదేశాల్లో కూడా ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది.
- రాత్రులంతా ప్రపంచ వ్యవహారాలు చక్కదిద్దుతుంటాను. రోజూ కొద్ది నిమిషాలే నిద్రపోతున్నాను.