సీబీఐలో అంతర్గత గొడవలకు సంబంధించిన కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపిన కేంద్రానికి, ఆ అధికారం లేదంటూ మళ్లీ అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా నియమించింది. స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా, అలోక్ వర్మ మధ్య విభేదాల కారణంగా కేంద్రం ఆ మధ్య ఇద్దరినీ సెలవుపై పంపించింది.
అయితే అలోక్ వర్మ తన తొలగింపు చెల్లదంటూ సుప్రంకోర్టును ఆశ్రయించారు. వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. సీబీఐ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అనీ, అది స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చనీ, రాజకీయ పార్టీలు అందులో జోక్యం చేసుకోకూడదని సుప్రీం చెప్పింది.
అయితే అలోక్ వర్మపై కొన్ని ఆంక్షలు విధించింది. ఆరోపణలు ఉన్నందువల్ల విచారణ పూర్తయ్యేవరకు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చాకే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు కేంద్రానికి ఎదురుదెబ్బగానే భావించవచ్చు.