హిందుత్వం… దేవాలయాలు… అంటే టక్కున గుర్తొచ్చే పార్టీ బీజేపీనే. మారిన పరిస్థితుల్లో బీజేపీ ఈ ఒక్క ప్రత్యేకతను కూడా కోల్పోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేవాలయాల బాట పట్టడమే దీనికి కారణం. అప్పుడెప్పుడో దయానంద సరస్వతి జాతిని పురికొల్పడానికి వేదాలకు తరలిపొండి అని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు నాయకులు ఎన్నికల్లో గెలవాలంటే దేవాలయాలకు తరలిపొండి అని తమ పార్టీవారికి పిలుపు ఇస్తున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి రాహుల్ దేవాలయాలను సందర్శించడం, పూజలు చేయడం కూడా ఒక కారణమని కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. దీంతో ఈ ఒరవడిని మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీలో దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా నియోజకవర్గంలోని 13 పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
అమేథీలో ఉన్న దుర్గా దేవాలయం, భవానీ దేవాలయం, కాళికన్‌దేవి, ఇతర పురాతన దేవాలయాలకు హైమాస్ట్ సోలార్ దీపాలు ఏర్పాటు చేయించారట. అలాగే దేవాలయాల్లో సంగీత వాద్యపరికరాలు సమకూర్చారు. అన్ని దేవాలయాలకు మంచి నీటి సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరిన్ని దేవాలయాలు బాగయ్యే అవకాశం ఉంది.
రాజ్యాంగ సవరణ చేసి ఏటానో, రెండేళ్లకోసారో ఎన్నికలు పెడితే బాగుండు. రైతు రుణ మాఫీల ద్వారా రైతులకు కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. దేవాలయాలు బాగుపడతాయి. మరిన్ని జనాకర్షక పథకాల ద్వారా పేదవారికి కూడా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. అయిదేళ్ల తర్వాత ఎన్నికలప్పుడు మాత్రమే జనాలు గుర్తొచ్చే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ఆలోచనేనేమో.