సెంచరీ కొడుతుందనుకున్న పెట్రోల్ ధర ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కొంతవరకు తగ్గింది. బైక్‌లు, ఎంట్రీ, మిడిల్ రేంజ్ కార్లలో తిరిగేవారికి ఇది చాలా ఊరట ఇచ్చే అంశమే. మరో శుభవార్త కూడా రానుంది. ఏంటంటే… వచ్చేది పార్లమెంట్ ఎన్నికల సీజన్. కాబట్టి ఆయిల్ కంపెనీలు ఎడాపెడా రేట్లు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. దీంతో వచ్చే అయిదారు నెలల్లో పెట్రోలు ధరలు ఎంతోకొంత తగ్గవచ్చు.
పెట్రోల మీద సుంకాల ద్వారా కేంద్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు షేర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే అధికారం కోసం ప్రభుత్వాలు, పార్టీలు ఏదైనా చేయగలవు కాబట్టి వీలైనంతవరకు పెట్రో ధరలు పెరగకుండా చూస్తారు. మరోవైపు పెట్రోల్‌ను నిత్యావసర వస్తువుగా పరిగణించి జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే పెట్రోల్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కానీ ప్రభుత్వ, ప్రయివేటు చమురు సంస్థలను కాదని ప్రభుత్వం అంత పని చేయగలదా అనేది అనుమానమే.
పెట్రో ధరలను ఇంకా ఆర్థిక కార్యకలాపంగానే దేశ నాయకులు, ఆర్థిక నిపుణులు పరిగణిస్తున్నారు. కోట్ల సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా రేటు తగ్గించడం అంటే అది అభివృద్ధిని దెబ్బ తీస్తుందనే దిక్కుమాలిన వాదనలు బయలుదేరతాయి. సంక్షేమ పథకాలు, రైతు రుణ మాఫీలదీ అదే పరిస్థితి. ఇవి అబివృద్ధి నిరోధకాలు అని హార్వర్డ్ ప్రొఫెసర్లు చాలా లాజిక్కులు చెబుతారు. మరి రైతుల ఆత్మహత్యలు అభివృద్ధికి సూచికలేమో మరి.