2013లో 4 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. అవి… రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్. అదే ఊపుతో నరేంద్ర మోదీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ ట్రెండ్ కొనసాగనుందా? ఈ రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తాయా?
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే మొత్తంగా వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అనిపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా చత్తీస్ గఢ్‌లో హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇదే వాతావరణం 2019లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు కూడా కొనసాగితే బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.
అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే ఒక రకంగా బీజేపీ భవిష్యత్తులో ప్రయోజనమే. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది కాబట్టి టీఆర్ ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వదు. ఇది పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తుంది. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌కు మరింత ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. మొత్తం ఐదు రాష్ట్రాలలో ఏ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచిన మొత్తంగా పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు చెప్పవచ్చు.
అయితే పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం ఉంది. ఈలోపు ఎలాంటి పరిణామాలు వస్తాయనేది అంచనా వేయలేం. ప్రభుత్వ అనుకూల పరిణామాలు వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల ఆర్థిక వ్యవస్థలో కొంత అలజడి ఉంది. ఉపాధి అవకాశాలు ఏమాత్రం పెరగలేదు. స్థూలంగా ఈ పరిస్థితులు ప్రతిపక్షానికి ఉపయోగపడేవే. ప్రధాని నరేంద్ర మోదీని ముందుంచి ఎన్నికలలో గెలవడం ఈసారి బీజేపీకి అంత తేలిక కాకపోవచ్చు.