మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ కొన్ని నెలల కిందటే దేశ అత్యున్నత న్యాయస్థానం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టబద్ద సంస్థ అయిన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీని అమలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వచ్చే మహిళలకు పూర్తి రక్షణ ఇచ్చి అందరిలాగే వారు కూడా ఆలయపూజల్లో పాల్గొనడానికి అవసరమైన అనుమతులు, ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఈ దిశగా కేరళలోని సీపీఎం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఆలయాలు, మతం విషయాల్లో ముందుండే బీజేపీ దీన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి తన వంతు కృషి చేస్తుంది.
అనేక రోజులు తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం, తదనంతర శుద్ధి కార్యక్రమాలు, కేరళలో పెచ్చరిల్లిన హింస… వీటిపై బీజేపీ స్పందన చూస్తే వారి రాజకీయం అర్థమవుతుంది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూనే, మరోవైపు బీజేపీ మహిళా మోర్చా మహిళలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారు. దీన్ని శాంతి భద్రతల విషయంగా మార్చి రాజకీయ లబ్ది పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనడంలో సందేహం లేదు.
అవసరమైతే బీజేపీ ఈ వివాదాన్ని మరింత తీవ్రస్థాయిని తీసుకెల్లి, కేరళలో రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రయత్నించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఏదైనా ప్రదేశంలో సంచరించడానికి కుల, మత, లింగ, ప్రాంత ప్రాతిపదికన ఎవరినీ అడ్డుకోరాదు. మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది. అయితే 40 ఏళ్లలోపు మహిళలను అనుమతించకపోవడంలోని సున్నితమైన అంశాలను అర్థం చేసుకోవచ్చు.
కానీ ఏ మహిళా నెలసరి (రుతుక్రమం) రోజుల్లో పూజల్లో పాల్గొనదు, ఏ దేవాలయానికీ వెళ్లదు. అది హిందూత్వ వాదులు చెప్పినా, చెప్పకపోయినా అపవిత్ర చర్య కిందకు వస్తుందని తెలియని మహిళలు ఉండరు. ఈ విషయం అయ్యప్ప భక్తులకు తెలియదా? వారి ఇళ్లలో మహిళలను పరిశీలిస్తే ఆమాత్రం తెలియదా? అలాంటప్పుడు ఈ వివాదం ఎందుకు.. రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప..?