ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్ పొత్తు, సీట్ల పంపిణీ ప్రకటనతో చంద్రబాబు ఫ్రంట్ ప్రయత్నాలకు ఒకరకంగా దెబ్బపడినట్టే. ఎన్నికల ముందే ఫ్రంట్‌గా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాలనే ప్రతిపాదనతో చంద్రబాబు నాయుడు దేశంలోని ప్రముఖ బీజేపీ వ్యతిరేక పార్టీలను, నాయకులను కొంతకాలంగా కలుస్తున్నారు. అయితే అనేక పార్టీలు ఎన్నికల ముందు పొత్తుకు అంత సుముఖంగా లేకపోవడం చంద్రబాబు ప్రయత్నాలను ముందుకు సాగనివ్వడం లేదు.
80 లోక్‌సభ సీట్లతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో ఎస్పీ, బీఎస్పీ చెరో 38 / 39 సీట్లలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్‌కు యూపీలో బలం లేనందువల్ల ఆ పార్టీని కూటమిలో కలుపుకోవడం లేదని అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే చెప్పారు. మమతా బెనర్జీ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో పొత్తుకు అంత సుముఖంగా లేరు.
ఇక తమిళనాడులో డీఎంకే కూడా ఎన్నికల ముందు పొత్తుకు వెళ్లకపోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పెద్దగా ప్రభావితం చేసే స్థాయిలో లేదు కాబట్టి స్టాలిన్ కూడా సొంతగా, లేదా ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లవచ్చు. అన్నిటికి మించి, అసలు ఏపీలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేదే ఇంకా తేలలేదు. అందువల్ల ఇతర పార్టీలను కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయమని చంద్రబాబు అడగలేరు.
మరోవైపు వామపక్ష పార్టీల్లో, సీపీఎం కూడా ఎన్నికల ముందు పొత్తులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రములలో పొత్తులుంటాయి తప్ప జాతీయ స్థాయిలో ఎలాంటి పొత్తులు పెట్టుకోకపోవచ్చు. సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తుకు సుముఖంగానే ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి వారి విధానంలో కూడా మార్పు రావచ్చేమో. సీట్ల సర్దుబాటు వ్యవహారాల్లో కాంగ్రెస్ పెద్దన్న వైఖరి కూడా అనేక పార్టీలకు రుచించడం లేదు.