కాంగ్రెస్, బీజేపీ ఏతర ఫ్రంట్ కోసం కేసీఆర్ జాతీయ స్థాయిలో చేస్తున్న ప్రయ్నతాలకు పెద్ద షాకే తగిలింది. ఇప్పటికే కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రెండు సార్లు కలిశారు. 2018లో ఒకసారి, మొన్న ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి కలిశారు. అయితే దీదీ మాత్రం జనవరి 19న కోల్‌కతాలో నిర్వహించనున్న ప్రతిపక్షాల ర్యాలీకి కేసీఆర్‌ను కాకుండా చంద్రబాబు నాయుడును ఆహ్వానించింది.
ఈ ర్యాలీకి బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నీ హాజరవుతుండటం విశేషం. ఇందులో ఎస్పీ అఖిలేష్ యాదవ్, బీఎస్సీ మాయావతి, ఎన్‌సీపీ శరద్ పవార్, టీడీపీ చంద్రబాబు నాయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ స్టాలిన్, కర్ణాటక సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఉన్నారు. వీరిలో చాలామందిని కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిశారు. కానీ వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కీలకమైన ఈ ర్యాలీకి కేసీఆర్‌కు ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్, బీజేపీతో పరోక్షంగా అవగాహన కలిగి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేకసార్లు ఆరోపించారు. గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వడం, మొన్నటి ఎన్నికల్లో కూడా బీజేపీ తెలంగాణలో అంత అగ్రెసివ్‌గా వెళ్లకపోవడాన్ని బట్టి టీఆర్ ఎస్ – బీజేపీ మధ్య అవగాహన ఉందనుకోవచ్చని విశ్లేషణలు వచ్చాయి.
ఈ ర్యాలీ తర్వాత జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా మరికొన్ని ర్యాలీలు నిర్వహించాలని ప్రాంతీయ పార్టీల నేతలు భావిస్తున్నారు. వీటికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఈ ర్యాలీల్లో పాల్గొంటారా లేదా అనేది సందేహంగానే ఉంది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై కొన్ని పార్టీలకు అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా ఒక మెట్టు దిగి ప్రధాని అభ్యర్థిత్వం ప్రస్తావన లేకుండా ప్రాంతీయ పార్టీలతో మైత్రికి సిద్ధమవుతుంది.