ఇటీవలి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశానికి ఎంతో కొంత శుభసూచకంగా మారే అవకాశం ఉంది. ఏపార్టీ గెలిచినప్పటికీ అన్ని పార్టీల ఎన్నికల అజెండాల్లో ఒక గుణాత్మకమైన మార్పు కనిపించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధాన కారణంగా రైతు రుణ మాఫీని ఆ పార్టీతోపాటు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే అంశం పనిచేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతు రుణ మాఫీ స్కీం అమల్లో ఉంది. తెలంగాణలో కూడా ఇదే ప్రధాన ఎన్నికల అజెండా అయింది. దీంతోపాటు రైతు బంధు పథకం కూడా టీఆర్ఎస్ విజయానికి కారణమని ఎక్కువమంది భావిస్తున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే వచ్చే పార్టమెంట్ ఎన్నికల్లో రైతుల సమస్యలు పార్టీల అజెండాల్లో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. దశాబ్దాల తర్వాత మళ్లీ జాతీయ మీడియా కూడా రైతు సమస్యలపై దృష్టి పెట్టడం విశేషం.
రైతు సమస్యలను ఎన్నికలకు ప్రధాన అజెండాగా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అభినందించదగ్గ అంశం. ఇటీవల అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో రైతు రుణ మాఫీలను అమలు చేస్తుంది. ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు. అందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీలేదు. మంచి పనులు చేసి రాజకీయ ప్రయోజనాలు ఆశించడంలో తప్పు వెతకాల్సిన అవసరం ఏముంది?
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర, ఢిల్లీలో రైతుల ఆందోళనలు దేశం మొత్తం ప్రజానీకాన్ని కదిలించాయి. వేల సంఖ్యలో రైతులు కదిలి రావడం అందరినీ ఆశ్చర్యగొలిపింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఢిల్లీలో వేల సంఖ్యలో రైతులు ఆందోళనలు చేయడం, అందులో రాహుల్ గాంధీ పాల్గొనడం ఆ పార్టీకి ఎంతోకొంత కలిసొచ్చింది. దీని ప్రభావం బీజేపీ ప్రభుత్వంపై తప్పకుండా పడింది. రైతుల కోసం ఏమైనా చేద్దామని ప్రస్తుతం కనీసం ఆలోచిస్తుందంటే ఈ ఆందోళనలు, తర్వాత అధికారం కోల్పోతామనే భయం ప్రధాన కారణాలు.