బాలాకోట్‌లో భారత వాయుసేన దాడిలో 300కుపై తీవ్రవాదులు చనిపోయి ఉంటారని భారత్ అధికారికంగా ప్రకటించింది. దాని తర్వాత పాకిస్తాన్ ప్రతిదాడికి దిగడం, మన విమానాలు తిప్పికొట్టడం, అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి దొరకడం, విడుదల… ఇవన్నీ ఒకదానివెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. కానీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న… భారత వైమానిక దాడిలో చనిపోయినట్టుగా చెబుతున్న తీవ్రవాదుల శవాలు ఏమయ్యాయి? 300 మందికిపైగా చనిపోతే కనీసం ఒక్క శవమైనా కనిపించకుండా ఎలాపోతాయి? దాడులను వీడియో తీసినట్టే దాడి తర్వాత అక్కడి పరిస్థితిని వీడియో తీసే ఉంటారు. కానీ వాటిని ఎందుకు రిలీజ్ చేయలేదు?
పాకిస్తాన్ మొదటి నుంచీ దీనిపై ఇదే ప్రశ్న అడుగుతోంది. భారత దాడుల వల్ల తమకు ఏమీ నష్టం జరగలేదని చెబుతుంది. అంతేగాక తమ అటవీ ప్రాంతానికి నష్టం వాటిల్లినట్టు, భారత్ ఎకో టెర్రరిజం ఆపాలంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ విదేశాంగ మంత్రి కూడా ఇదే ప్రశ్న అడిగారు. భారత్ చెబుతున్నట్టు ఉగ్రవాదులు చనిపోయి ఉంటే డెడ్ బాడీస్ ఏవి అని ప్రశ్నించారు.
అంతేగాక రాయిటర్స్ జర్నలిస్టులు ఇద్దరిని బాలాకోట్ తీసుకెళ్లి అక్కడ జరిగిన నష్టాన్ని వారికి పాకిస్తాన్ చూపించింది. రాయిటర్స్ కథనం ప్రకారం భారత వైమానిక దాడుల వల్ల కొన్ని చెట్లు కూలిపోయాయి. ఒక వృద్ధుడికి గాయాలు అయినట్టు కూడా రాయిటర్స్ పేర్కొంది. అంతకుమించి నష్టమేమీ జరగలేదని పేర్కొంది. అక్కడి గ్రామస్తులు కూడా భారత్ చెబుతున్నట్టు అక్కడ ఉగ్రవాదులెవరూ చనిపోలేదని రాసుకొచ్చింది.
భారత ప్రభుత్వం కూడా దాడుల్లో చనిపోయిన తీవ్రవాదులకు సంబంధించి ఎలాంటి వీడియోలు రిలీజ్ చేయలేదు. దాడి చేసిన మరుసటి మాత్రమే ఒక వీడియో బయటికొచ్చింది. అందులో భారత వాయుసేన విమానాలు కొన్ని ప్రాంతాలపై బాంబులు వేసినట్టు, పేలుడు శబ్దాలు ఉన్నాయి. కానీ ఉగ్రవాదుల శవాలేవీ కనిపించలేదు. దీంతో ఇప్పుడు ప్రజల దృష్టి ఉగ్రవాదులు చనిపోయింది నిజమేనా అనే దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.