ఎన్నికల సంవత్సరంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆకర్షించడానికి తంటాలు పడింది. ఒకవైపు రాహుల్ గాంధీ రుణ మాఫీలు, కనీస ఆదాయ పథకం అంటూ ఒత్తిడి తెస్తుండటంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమం బాట పట్టింది. తెలంగాణలోని నగదు బదిలీ పథకం తరహాలో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం చేసే పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పేరుతో ఏటా రూ.6000 రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది.
ఈ పథకం దేశవ్యాప్తంగా అమలవుతుంది. అయిదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులే ఈ పథకం కింద అర్హులవుతారు. మొత్తం ఆరువేల రూపాయలను మూడు దశల్లో రూ.2000 చొప్పున ఇస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలోకి వేస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతారని అంచనా.
రైతుల అభివృద్ధికి ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు తీసుకోకుండా ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకు దీర్ఘకాలంలో ఎలాంటి ఉపయోగం ఉండదని నిపుణులు అంటున్నారు. పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, దళారుల వ్యవస్థను తొలగించి ప్రభుత్వమే నేరుగా పంటను కొనడం వంటి చర్యలు రైతులను దీర్ఘకాలంలో ధనవంతులను చేస్తాయి.
ఎకరాల చొప్పున ఎంతోకొంత ఇవ్వడం వల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప రైతులకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆరువేలు రైతులు పెట్టే పెట్టుబడిలో ఏ మూలకూ రావు. ఒక ఎరువుల బస్తా రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంది. కూలీకి వేతనంగా రోజుకు రూ.700 వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ఆరువేల వల్ల రైతు నిలదొక్కుకుంటాడనుకోవడం భ్రమే.