నందమూరి బాలకృష్ణ మీద తన సెటైర్ల యుద్ధం కొనసాగిస్తున్నారు నాగబాబు. తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ అనడం నాగబాబుకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్, చిరు ఫ్యాన్స్ బాలయ్యను ట్రోల్ చేశారు. తర్వాత నాగబాబు మాట్లాడుతు బాలయ్య ఎవరో తనకు తెలియదనీ, తనకు తెలిసింది సీనియర్ నటుడు బాలయ్య అని వ్యాఖ్యానించారు.
మళ్లీ కొంచెం గ్యాప్ ఇచ్చి, బాలకృష్ణ అంటే తనకు తెలిసింది పాతతరం కామెడీ నటుడు బాలకృష్ణే అని, ఆయన ఎన్టీఆర్‌తో కూడా కలిసి నటించారని అన్నారు. ఆ తర్వాత ఇరు పక్షాలు కామ్ అయిపోయాయి. దీంతో వివాదం సద్దుమణిగినట్టే అని అందరూ భావించారు. తాజాగా నాగబాబు మళ్లీ చెలరేగడంతో వివాదం ఇంకా కొనసాగుతున్నట్టే అయింది.
సారే జహాసే అచ్ఛా గీతాన్ని పాడుతున్న ఓ బాలుడి వీడియోను నాగబాబు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిన్న పిల్లాడివైనా చాలా బాగా పాడావని నాగబాబు ఆ బాలుడిని అభినందిస్తూ క్యాప్షన్ పెట్టారు. పరోక్షంగా ఇది బాలకృష్ణను ఉద్దేశించి పెట్టిందే అన్న విషయం అందరికీ అర్థమైంది. దీంతో మళ్లీ నందమూరి, మెగా అభిమానుల మధ్య పరస్పర ట్రోలింగ్‌లు తప్పేలా లేవు.