ఎప్పడూ వివాదాలకు కేంద్రంగా ఉండే రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో అనేకమంది సీనియర్లు, జూనియర్లు నటిస్తున్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనూ నటిస్తున్నట్టు ఇప్పటివరకు సమాచారం వెలువడలేదు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించకపోయినా, సినిమాలో ఆయన పాత్ర ఉన్నట్టు సమాచారం.
లక్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాత్రను ప్రవేశపెట్టడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయట. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ తల్లి శాలినీకి మధ్య అప్పట్లో ఉన్న సత్సంబంధాల కారణంగా ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ కుటుంబంతో శాలినీ – ఎన్టీఆర్ కుటుంబం మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి లక్ష్మీపార్వతే కారణమట. అందుకే అనివార్యంగా లక్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని సినీవర్గాల భోగట్టా.
బాలకృష్ణ నిర్మిస్తూ, నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగా రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో వర్మ సినిమాకి రాజకీయ రంగు అంటింది. వర్మ మాత్రం ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకమైన లక్ష్మీ పార్వతి దశనే సినిమాలో ప్రధానంగా తీస్తున్నట్టు చెబుతున్నారు.
వైసీపీ, లక్ష్మీపార్వతి ఈ సినిమాతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే వర్మ, లక్ష్మీపార్వతి కలిసి తిరుపతి వెళ్లడం, వైసీపీతో అనుబంధం ఉన్న వ్యక్తి నిర్మాతగా ఉండటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. దీనిపై తెలుగుదేశం నాయకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మహానటుడు ఎన్టీఆర్ జీవితానికి మచ్చ తెచ్చే విధంగా ఉంటే ఈ సినిమాను ప్రజలు తిరస్కరిస్తారని చెబుతున్నారు.