మళయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నశ్రీదేవి బంగ్లా సినిమా మరింత వివాదాస్పదం అవుతోంది. మొన్న జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా పేరు విని అసహనానికి గురైంది. ఈ వివాదంపై స్పందించాలని జాన్వీని ఓ రిపోర్టర్ కోరగా, ఆమె నిరాకరించి వెళ్లిపోయింది.
శ్రీదేవి జీవితం, చివరి రోజుల ఆధారంగా శ్రీదేవి బంగ్లా సినిమా తీస్తున్నారని వార్తలు వచ్చాయి. సినిమా టైటిల్‌తోపాటు సినిమాలో ప్రధాన పాత్ర పేరు కూడా శ్రీదేవి కావడంతో దీనిపై ఆసక్తితోపాటు వివాదం కూడా రాజుకుంది. సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కావడంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ సినిమాపై కేసు వేశారు.
దీంతో ఈ సినిమా ఎటువైపు వెళుతుందో అన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రియా ప్రకాష్ వారియర్ ఈ వివాదంతో టాప్ స్టార్ స్థాయికి చేరుకుంది. తన తొలి సినిమా కూడా ఇంకా విడుదల కాకముందే ఈ స్థాయిలో ప్రచారం, స్థాయి వస్తుందని ప్రియా ఊహించి ఉండకపోవచ్చు. తొలి సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు.