ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో రెండో భాగం ఎన్టీఆర్ – మహానాయకుడు గురించి ఒక్కసారిగా చర్చలు ఆగిపోయాయి. మొదటి భాగం కంటే రెండో భాగంలో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాలకృష్ణ మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఊహించిన స్థాయిలో విజయం సాధించకపోవడం రెండో భాగం మీద దాని ప్రభావం పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ జీవితం రెండో భాగంలో వివాదాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం, కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం, చంద్రబాబు వల్ల పదవీచ్యుతుడు కావడం, చివరికి మరణించడం.. ఇలా అన్నీ వివాదాస్పద అంశాలే. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో వీటిని ఏదో విధంగా చర్చించకతప్పదు. దీనివల్ల రాజకీయంగా టీడీపీకి, తన బావకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందేమోనని బాలకృష్ణ భావించి సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇంకో వెర్షన్ కూడా ఉంది. మొదటి భాగం ప్రచారంలో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌లు చూసినవారికి సినిమా సగం అర్థమై పోయింది. ఎన్టీఆర్ వేసిన పాత్రలు, పాటలు కొన్ని కలిపి సినిమాగా మలచడం తప్ప ఇందులో పెద్దగా ఏమీ ఉండకపోవచ్చని అందరికీ తెలిసిపోయింది. చివరకు సినిమా కూడా అలాగే ఉండటంతో పెద్దగా ఆసక్తి నెలకొనలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రచారం జోలికి పోకుండా గుట్టుగా సినిమా తీస్తే కుతూహలం పెరుగుతుందేమోననే వ్యూహంలో టీమ్ ఉందనేది మరో వెర్షన్.
ఏ వెర్షన్ నిజమైనా, కాకపోయినా, ఒకటి మాత్రం నిజం… ఎన్టీఆర్ జీవితం అంటే ప్రజలకు రాజకీయాలు ఒక్కటే కాదు. ఆయన వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, అలవాట్లు, జీవన విధానం, కుటుంబం, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ జీవితంలో భాగమే. వీటిని ప్రస్తావించకుండా కేవలం టీడీపీకి పనికొచ్చే అంశాలనే సినిమాగా తీస్తే అది టీడీపీ సినిమానే అవుతుంది తప్ప, బయోపిక్ అనిపించుకోదేమో.