బాహుబలి బంపర్ హిట్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. సినిమా టైటిల్, నటీనటులను చూస్తే కథ ఒక పట్టాన అర్థం కావట్లేదని అభిమానులు జుట్లు పీక్కుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం RRR కి ప్రేరణ రామాయణం అంటున్నారు సినీ వర్గాలు. రాజమౌళికి ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా మహాభారతం సినిమాగా తీయాలని తన లక్ష్యంగా చాలాసార్లు చెప్పాడు కూడా.
ఆర్ ఆర్ ఆర్ విషయానికొస్తే… ఇందులో రాముడిగా రామ్ చరణ, రావణుడిగా తారక్ నటిస్తున్నారని సమాచారం. కథకి ప్రేరణ రామాయణం అయినప్పటికీ పాత్రల చిత్రణ, కథనం ఆధునికమా, ఇతిహాస పద్ధతిలోనేనా అనేది తెలియాల్సి ఉంది. అలాగే హీరోయిన్‌ల ఎంపిక విషయంలోనే ఇంకా అనేక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తున్నా ముఖ్యమైన అంశాలు బయటకు రాకుండా రాజమౌళి సీక్రెసీ మెయింటెయిన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌ల గురించి కూడా ఇంకా గాసిప్‌లు వస్తూనే ఉన్నాయి. ప్రియమణికి ఒక మంచి పాత్ర దొరికినట్టు చెప్పుకుంటున్నారు. ప్రియమణి ఇప్పడు ఫామ్‌లో లేదు కాబట్టి తన పాత్ర హారోయిన్ కాకపోవచ్చు. కీర్తి సురేష్‌ను సీత పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. మహానటి ద్వారా ప్రత్యేక ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ ఈ పాత్రకు సరిపోతుందని రాజమౌళి భావించి ఎంపిక చేసినట్లు సినీ వర్గాల కథనం. వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.