నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్.టి.ఆర్. బయోపిక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈనెల 21న ఎన్టీఆర్ పుట్టిన ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరులో జరగనుంది. తెలుగు చిత్ర సీమను దశాబ్దాల పాటు ఏలడంతోపాటు తెలుగు దేశం పార్టీ స్థాపించి కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఈ సినిమా ద్వారా బాలయ్య తెరకెక్కిస్తున్నారు. తన తండ్రి పాత్రలో నటిస్తూ బాలకృష్ణ ఈ సినిమాను నిర్మస్తుండటం విశేషం.
రెండు భాగాలుగా తీస్తున్న ఎన్‌టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్‌టీఆర్ – కథానాయకుడు ట్రైలర్, ఆడియోను ఈ నెల 21 విడుదల చేయనున్నారు. సినిమాను జనవరి 9 సంక్రాంతి, నూతన సంవత్సర కానుకగా విడుదల చేయనున్నారు. ఎన్‌టీఆర్ సినిమా జీవితం మొదలు దగ్గర్నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.
ఇక సీఎం అయిన తర్వాత పరిణామాల మొదలు చనిపోయే వరకు ఎన్‌టీఆర్ – మహానాయకుడు (రెండో భాగం) సినిమాలో చూపించనున్నారు. రెండో భాగం జనవరి 25న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి రానా, సుమంత్, కళ్యాణ్ రామ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌లుగా రకుల్ ప్రీత్ సింగ్, నిత్య మీనన్, అతిథి పాత్రల్లో మరికొందరు నటిస్తున్నారు.
పలు సందర్భాల్లో విడుదల చేసిన ఎన్‌టీఆర్ – కథానాయకుడు పోస్టర్‌లు బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఎన్‌టీఆర్ పోషించిన వివిధ పాత్రల్లో బాలకృష్ణ నటిస్తుండటం నందమూరి అభిమానులకు పండగ కానుంది.